
లండన్: అద్భుత ఫామ్‌లో ఉన్న రెండు జట్ల మధ్య ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే సెమీస్ బెర్త్‌ను ఖాయం చేసుకుని జోరుమీదున్న ఆస్ట్రేలియాతో శనివారం జరిగే మ్యాచ్‌లో న్యూజిలాండ్ అమీతుమీ తేల్చుకోనుంది. ప్రస్తుతం 11 పాయింట్లతో ఉన్న కివీస్‌కు రెండు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ఎలాంటి సమీకరణాలు అవసరం లేకుండా సెమీస్‌కు చేరాలంటే కనీసం ఇందులో ఒకటైనా గెలవాలి. ఈ నేపథ్యంలో ఆసీస్‌ను ఓడించి ఇక్కడే నాకౌట్ బెర్త్‌ను ఖాయం చేసుకోవాలని బ్లాక్ క్యాప్స్ పట్టుదలగా ఉంది. అయితే ఇండియా చేతిలో ఓడిన తర్వాత సూపర్ ఫామ్‌ను అందిపుచ్చుకున్న ఆసీస్.. ఈ మ్యాచ్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతున్నది. ఇద్దరి మధ్య గతాన్ని చూసినా.. ట్రాన్స్ టాస్మన్ రైవలరీలో ఆసీస్‌దే పైచేయిగా ఉంది. తటస్థ వేదికల్లో జరిగిన 20 మ్యాచ్‌ల్లో 19సార్లు కంగారూలు నెగ్గారు. 1999 వరల్డ్‌కప్ మినహా మరెప్పుడూ తటస్థ వేదికలో కివీస్ చేతిలో ఓడలేదు. ఓపెనర్లు వార్నర్, ఫించ్ భీకరఫామ్‌లో ఉన్నారు. టోర్నీలో లీడింగ్ స్కోరర్లలో తొలి రెండు స్థానాల్లో ఉన్న వీరిద్దరు ఇప్పటికే మూడుసార్లకుపైగా సెంచరీ భాగస్వామ్యాలు నమోదు చేశారు. ఖవాజా, స్మిత్, మ్యాక్స్‌వెల్‌లతో మిడిలార్డర్ పటిష్టంగా ఉంది. బౌలింగ్‌లో స్టార్క్ దుమ్మురేపుతున్నాడు. కమిన్స్, బెరెన్‌డార్ఫ్ కూడా చెలరేగితే కివీస్‌కు కష్టాలు తప్పవు.
విలియమ్సన్‌పై భారం..
టోర్నీలో అండర్‌డాగ్స్‌గా దిగిన కివీస్ ఇప్పటివరకు అత్యుత్తమ ఆటతీరును చూపెట్టింది. కానీ మొన్న పాక్ చేతిలో ఓడటం కాస్త ఆత్మవిశ్వాసం దెబ్బతిన్నది. బ్యాటింగ్‌లో విలియమ్సన్ ఒక్కడే జట్టు భారాన్ని మోస్తున్నాడు. గప్టిల్, మన్రో, లాథమ్, నీషమ్ గాడిలో పడాలి. టేలర్ ఫర్వాలేదనిపిస్తున్నా భారీ ఇన్నింగ్స్ బాకీ ఉంది. బౌలింగ్‌లో బౌల్ట్, ఫెర్గుసన్, శాంట్నర్‌తో పటిష్టంగా కనిపిస్తున్నా.. ఆసీస్ హిట్టర్లను నిలువరించాలంటే వీళ్లు బాగా శ్రమించాలి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు టాప్ ప్లేస్‌లోకి వెళ్లనుండడంతో ఇరుజట్లు ఈ పోరును ప్రతిష్టాత్మకంగా తీసుకొన్నాయి.
పాక్‌కు చావోరేవో..
అఫ్గానిస్థాన్‌తో జరిగే మరో లీగ్ మ్యాచ్ పాకిస్థాన్‌కు కీలకంగా మారింది. నాకౌట్‌కు చేరాలంటే మిగతా రెండు మ్యాచ్‌ల్లోనూ గెలవాల్సిన స్థితిలో పాక్ ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగుతోంది. బ్యాట్స్‌మెన్ ఫామ్‌లో ఉండడంతో పాటు బౌలర్లు మంచి టచ్‌లో ఉండడం జట్టుకు శుభపరిణామం. మరోవైపు ఇప్పటికే ఏడు ఓటములతో నాకౌట్ నుంచి వైదొలిగిన అఫ్గాన్ ఈ మ్యాచ్‌లో సంచలనంపై దృష్టిపెట్టింది. ఈ మ్యాచ్‌లో నెగ్గి ఓదార్పు విజయం సాధించాలని భావిస్తోంది.