ఆర్కిటిక్ మహాసంద్రంలోని ఐస్ అనుకున్నదాని కన్నా వేగంగా కరిగిపోతోందట. జులైలో వేడి పెరగడంతో ఉత్తర ధ్రువం వద్ద ఐసంతా కరిగిపోతోందని కొలరాడోలోని నేషనల్ స్నో అండ్ ఐస్ డేటా సెంటర్ ప్రకటించింది. 2012 జులై రికార్డుకు చేరువవుతోందని తెలిపింది. ఆర్కిటిక్ సర్కిల్లోని అలస్కా, కెనడా, గ్రీన్‌ల్యాండ్‌లలో టెంపరేచర్లు పెరగడంతో మూడు దశాబ్దాల సగటు కరుగుదల కన్నా స్పీడ్‌గా ఐస్ కరిగిపోతోందని చెప్పింది. దాని వల్ల 20 వేల చదరపు కిలోమీటర్ల మేర మంచు మాయమవుతోందని పేర్కొంది.
ఉత్తరార్ధగోళంలో వసంతకాలం నాటికి మంచు కరగడం మొదలవుతుందని, కరిగాక, మళ్లీ సెప్టెంబర్ నాటికి తిరిగి మునుపటి స్థితిలోకి వస్తుందని చెప్పింది. అయితే, ఈసారి మాత్రం ఆ పరిస్థితి కనిపించకపోవచ్చని బ్రిటన్ వాతావరణ శాఖ తెలిపింది. ఆర్కిటిక్ సర్కిల్లో ప్రస్తుతం ఎన్నడూ లేనంతగా కార్చిచ్చు రాజుకుందని, కొన్ని వారాల్లోనే వందలాది కార్చిచ్చు ఘటనలు వెలుగులోకి వచ్చాయని, అది కూడా ఆర్కిటిక్ ఐస్‌పై ప్రభావం చూపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని యూరోపియన్ యూనియన్ కోపర్నికస్ క్లైమేట్ చేంజ్ సర్వీస్ వెల్లడించింది.
