
న్యూఢిల్లీ: ఐసీఐసీఐ బ్యాంక్ ఒకే రోజులో చెక్ సెటిల్‌మెంట్ చేయనున్నట్టు ప్రకటించింది. దీని వల్ల చెక్కుల క్లియరెన్సులో జాప్యం తగ్గుతుందని తెలిపింది. అక్టోబర్ 4 నుంచి బ్యాంక్ బ్రాంచులలో సమర్పించే చెక్కులు ఒకే వర్కింగ్డేలో క్లియర్ అవుతాయని ఐసీఐసీఐ అధికారిక వెబ్‌సైట్ తెలిపింది. ఆర్‌బీఐ కొత్త చెక్ క్లియరింగ్ సిస్టమ్‌కు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం బ్యాంకులు చెక్ ట్రంకేషన్ సిస్టమ్ (సీటీఎస్)ను ఉపయోగిస్తున్నాయి. ఇది చెక్ ఎలక్ట్రానిక్ ఇమేజ్ను డ్రావీ బ్యాంకుకు పంపుతుంది. దీని వల్ల చెక్కులను భౌతికంగా పంపాల్సిన అవసరం ఉండదు.
అయితే, డ్రాప్ బాక్స్‌లలో లేదా ఏటీఎంలలో డిపాజిట్ చేసినప్పుడు సెటిల్‌మెంట్ కావడానికి రెండు పని దినాలు పడుతుంది. రూ.50 వేల కంటే ఎక్కువ విలువైన చెక్కులకు భద్రత కోసం బ్యాంక్ పాజిటివ్ పే ఫీచర్‌ను వాడుతతారు. మోసాన్ని నివారించడానికి, కస్టమర్లు చెక్కు రాసే ముందు ముఖ్యమైన వివరాలను ఎలక్ట్రానిక్‌గా ముందే ధ్రువీకరించవచ్చు. రూ.5 లక్షల కంటే ఎక్కువ విలువైన చెక్కులకు పాజిటివ్ పే ఫీచర్ తప్పనిసరి. లేకపోతే చెక్కులను తిరస్కరిస్తారు. ఆర్‌బీఐ ఆదేశాల ప్రకారం, అక్టోబర్ 4 నుంచి చెక్కుల సమర్పణకు ఒకే రోజు సెషన్ ఉంటుంది.