వాళ్లు పెద్ద ఇడియట్స్

వాళ్లు పెద్ద ఇడియట్స్
  • కరోనా వేళ.. మాస్క్‌‌ లేకుండా ఫ్లైట్‌‌లో పార్టీలా?
  • చెంప పగలగొట్టాలన్న కెనడా పీఎం జస్టిన్ ట్రూడో

కెనడా: ప్రపంచ దేశాలన్నింటినీ భయపెడుతున్న మహమ్మారి కరోనా. పీఎం, సీఎం, సామాన్యులు అనే తేడా లేకుండా అందరూ అన్ని కార్యక్రమాలను వాయిదా వేసుకుంటున్నారు. ఇటువంటి కష్ట సమయంలో ఒక ఫ్లైట్‌‌‌‌లో మాస్క్‌‌‌‌ కూడా పెట్టుకోకుండా పార్టీ చేసుకున్నారు కొంతమంది. కెనడాలో జరిగిన ఈ ఘటన ఇంటర్నెట్‌‌‌‌లో వైరల్ కావడంతో ఆ దేశ ప్రధాని సహా చాలామంది పార్టీ చేసుకున్న వారిపై విరుచుకుపడ్డారు. వాళ్లంతా ఇడియట్స్‌‌‌‌ అని, అలాంటి వాళ్ల చెంప పగలకొట్టాలని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఫైర్ అయ్యారు. వారంతా బాధ్యతలేనివారని  చెప్పారు.

‘‘ఆ వీడియో చూసి కెనడా సిటిజన్స్ అందరిలాగే నేను కూడా నిరాశ చెందాను. తమను తాము కాపాడుకోవడానికి ప్రజలు క్రిస్మస్ సెలబ్రేషన్స్, కుటుంబ సమావేశాలను తగ్గించుకోవడానికి ఎంత కష్టపడ్డారో తెలుసు’’ అని ట్రూడో అన్నారు. న్యూ ఇయర్ పార్టీ కోసం కెనడా నుంచి కొంతమంది సభ్యులను మెక్సికోకు తీసుకెళ్లేందుకు డిసెంబర్‌‌‌‌‌‌‌‌ 30న సన్‌‌‌‌వింగ్‌‌‌‌ చార్టెడ్ ఫ్లైట్‌‌‌‌ను 111 ప్రైవేట్ క్లబ్ ఫౌండర్ జేమ్స్‌‌‌‌ అవద్‌‌‌‌ బుక్ చేశారు. పార్టీలో పాల్గొన్న వాళ్లు రిలీజ్ చేసిన వీడియో నెట్‌లో వైరల్ అయ్యింది. ఒక వోడ్కా బాటిల్‌ను అందరూ తాగుతున్నట్టు, ఒక మహిళ ఎలక్ట్రానిక్ సిగరెట్ తాగి పొగ వదులుతున్నట్టు, మాస్కులు లేకుండా పార్టీకి హాజరైనట్టు వీడియోలో ఉంది. దీనిపై విమర్శలు వెల్లువెత్తడంతో జనవరి 5న వాళ్ల రిటర్న్‌‌‌‌ ఫ్లైట్‌‌‌‌ను సన్‌‌‌‌వింగ్ కేన్సిల్ చేసింది. అలాంటి వారిని తమ కంపెనీ ఫ్లైట్‌లో ప్రయాణించేందుకు అనుమతించబోమని తేల్చి చెప్పింది.