రోదసిలో చైనా తన శక్తిని పెంచుకుంటోంది. కో ఆర్బిటాల్ కిల్లర్ శాటిలైట్లతో పాటు అల్లంత దూరంలో అంతరిక్షంలో దాడి చేసే క్షిపణులను తయారు చేసుకుంటోంది. మరి, అలాంటి చైనాను ఎదుర్కోవాలంటే మనమూ అంతే దీటుగా ఉండాలి కదా. అందుకే మన శక్తి ఏంటో తెలియజేసేందుకు ఆర్మీ, నేవీ, ఎయిర్ఫోర్స్ కలిసి అంతరిక్ష యుద్ధానికి (స్పేస్ వార్) సిద్ధమవుతున్నాయి. యుద్ధమంటే నిజం యుద్ధం కాదు. అక్కడ పొంచి ఉన్న ముప్పును ఎలా ఎదుర్కుంటారో ‘డ్రిల్స్’ చేసి చూపించబోతున్నారన్నమాట. రక్షణ శాఖ పరిధిలోని ట్రై సర్వీస్ ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ (ఐడీఎస్) గురు, శుక్ర వారాల్లో ‘ఇండ్స్పేస్ఎక్స్’ పేరిట ఈ డ్రిల్స్ చేయబోతోంది. చైనాను గట్టిగా ఎదుర్కోవాలంటే మన అంతరిక్ష వ్యవస్థల రక్షణ కోసం ఆయుధాలు తయారు చేసుకోవాల్సిన అవసరం ఉందని అధికారులు చెబుతున్నారు. ‘‘ఈ ఏడాది మార్చి 27న మిషన్ శక్తి ప్రయోగాన్ని విజయవంతంగా చేశారు. దేశం మరింత బలోపేతమయ్యేలా, సురక్షితంగా మార్చేలా ఈ ప్రయోగాన్ని చేసినట్టు ప్రధాని మోడీ అన్నారు. అదే మార్గంలో రోదసిలో ఎదురయ్యే సవాళ్లు, లోపాలను గుర్తించేందుకు ఇండ్‌స్పేస్‌ఎక్స్‌ను నిర్వహించబోతున్నామని ఆయన చెప్పారు” అంటూ డ్రిల్స్ గురించి ఓ అధికారి చెప్పారు. స్పేస్ వార్ ఆయుధాలు దేశాల ఆర్థిక, సామాజిక రంగానికి ఉపయోగపడే వ్యవస్థలను నాశనం చేయడమే కాకుండా రక్షణ, నిఘా శాటిలైట్లను, కమ్యూనికేషన్ వ్యవస్థలను జామ్ చేస్తాయి. అలాంటి వాటిని ఎదుర్కొనేందుకే మన రక్షణ దళాలు ఈ డ్రిల్స్ చేస్తున్నాయి.
