ఇంకో లక్ష కోట్ల అప్పు కావాలే

ఇంకో లక్ష కోట్ల అప్పు కావాలే
  • నీళ్లు పారాలంటే అప్పులే దిక్కు
  • ప్రాజెక్టుల కోసం ఇప్పటికే రూ.1.19 లక్షల కోట్ల లోన్లు
  • బడ్జెట్ కేటాయింపులు తగ్గడంతో లోన్లే దిక్కు
  • రెండు లక్షల కోట్లకు చేరిన ఇరిగేషన్ అప్పులు

హైదరాబాద్‌, వెలుగు: ఇరిగేషన్‌ ప్రాజెక్టుల పనులకు అప్పులే దిక్కువుతున్నాయి. బడ్జెట్‌ కేటాయింపులు పాత బిల్లులకే సరిపోకపోవడంతో కొత్తగా మళ్లీ లోన్లు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. భారీ ప్రాజెక్టులే కాదు చిన్న తరహా ప్రాజెక్టులకూ ఇదే దారి. కేసీఆర్‌ సర్కారు చేపట్టిన వాటితోపాటు పాత ప్రాజెక్టుల పనులు పూర్తయ్యే సరికి ఇరిగేషన్‌ అప్పుల చిట్టా రూ.2 లక్షల కోట్లకు చేరనుంది. మున్ముందు కూడా బడ్జెట్‌లో ఇరిగేషన్‌కు ఎక్కువ నిధులు ఇచ్చే అవకాశం లేదని అధికారులు చెప్తున్నారు. దీంతో లోన్లు తీసుకోవడం తప్ప వేరే దారి లేదని అంటున్నారు.

కాళేశ్వరానికే 60 శాతం
రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న ప్రధాన ప్రాజెక్టులపై ఇప్పటిదాకా రూ.1.04 లక్షల కోట్లు ఖర్చు చేశారు. ఇందులో 80 శాతం పైగా తెలంగాణ ఏర్పడిన తర్వాతే ఖర్చు పెట్టారు. ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టుకే 60 శాతానికిపైగా నిధులు వెచ్చించారు. తర్వాతి స్థానంలో పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు ఉంది. మిగతా అన్ని ప్రాజెక్టులకు కలిపి రూ.30 వేల కోట్లకు పైగా వ్యయం చేశారు. ఇటీవల సవరించిన అంచనాల ప్రకారం ప్రధాన ప్రాజెక్టుల వ్యయం రూ.2.10 లక్షల కోట్లు. రెండు కార్పొరేషన్ల ద్వారా రూ.1.19 లక్షల కోట్ల లోన్లు తీసుకునేందుకు ప్రభుత్వం ఓకే చెప్పింది. ఆయా ఆర్థిక సంస్థలతో సదరు కార్పొరేషన్లు అగ్రిమెంట్‌ కూడా చేసుకున్నాయి. ఇందులో రూ.53 వేల కోట్లకు పైగా లోన్లు తీసుకున్నాయి. ఇంకో రూ.65 వేల కోట్ల గ్రౌండింగ్‌ కావాల్సి ఉంది. ప్రాజెక్టుల పనులు జరుగుతున్న కొద్దీ ఆ మేరకు లోన్‌ మొత్తం రిలీజ్‌ అవుతుంది. ఈ లెక్కన 2021– 22 ఆర్థిక సంవత్సరంలో రూ.25 వేల కోట్లకు పైగా లోన్‌ తీసుకునే అవకాశముంది.

ఇంకో లక్ష కోట్లు కావాలే
నిర్మాణంలో ఉన్న కాళేశ్వరం, పాలమూరు – రంగారెడ్డి, సీతారామ ఎత్తిపోతలు, వరద కాలువ, దేవాదుల ప్రాజెక్టు, సమ్మక్కసాగర్‌ (కంతనపల్లి బ్యారేజీ), సీతమ్మసాగర్‌ (దుమ్ముగూడెం బ్యారేజీ) పూర్తి చేయడానికి ఇంకో రూ.1.06 లక్షల కోట్లు అవసరం. ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టుకే రూ.50 వేల కోట్లు కావాలి. ఈ ప్రాజెక్టుకు ఇంకో రూ.44 వేల కోట్లకు పైగా లోన్‌ లింకేజీ ఉంది. పాలమూరు ఎత్తిపోతలకు రూ.40 వేల కోట్లు అవసరం. ఇందులో 70 శాతం వరకు లోన్‌ రూపంలోనే సమకూర్చుకోవాల్సి ఉంది. ఈ లెక్కన పాలమూరు కోసం ఇంకో రూ.30 వేల కోట్ల వరకు లోన్‌ తెచ్చుకోవాల్సిందే. వరద కాలువ, దేవాదులకు ఏఐబీపీ కింద కేంద్రం కొంత సాయం చేస్తోంది. ఈ రెండు ప్రాజెక్టులకు కలిపి లోన్‌ లింకేజీ రూ.5 వేల కోట్ల వరకు అందుబాటులో ఉంది. ఈ ప్రాజెక్టులు పూర్తి చేసే నాటికి నిర్మాణ వ్యయం మరింత పెరగనుంది. అవి కూడా లెక్కలోకి తీసుకుంటే ఇంకో రూ.50 వేల కోట్లకుపైగా అప్పు చేయాల్సి వస్తుందని అధికారులు చెప్తున్నారు. ప్రభుత్వం ప్రయారిటీగా పెట్టుకున్న మీడియం ఇరిగేషన్‌ ప్రాజెక్టులు చనాక–కొరాట, సదర్మాట్‌ బ్యారేజీ, కుప్టి లిఫ్ట్‌, కుమ్రంభీం వాగు ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు రూ.1,500 కోట్లకు పైగా లోన్లు తీసుకోవాలనే యోచనలో ఇరిగేషన్‌ అధికారులు ఉన్నారు. చెక్‌ డ్యాంల కోసం ఇప్పటికే రూ.2 వేల కోట్ల వరకు లోన్‌ తీసుకున్నారు. ఇవికాక సీఎం ఇటీవల కొత్తగా ప్రకటించిన పలు లిఫ్టులు, లింక్‌ ప్రాజెక్టులకూ లోన్‌ తీసుకోవాల్సి వస్తుందని, మొత్తం కలిపితే ప్రాజెక్టుల అప్పులు రూ.2 లక్షల కోట్లకు చేరుతాయని చెప్తున్నారు.

రెండు కార్పొరేషన్లు.. లక్ష కోట్లు పైనే
ఇరిగేషన్‌ డిపార్ట్‌మెంట్‌ పరిధిలోని కాళేశ్వరం కార్పొరేషన్‌, ఇరిగేషన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్షర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్ల ద్వారా ప్రభుత్వ గ్యారంటీతో లోన్లు తీసుకుంటున్నారు. కాళేశ్వరంతోపాటు పాలమూరు– రంగారెడ్డి లిఫ్ట్‌ స్కీమ్​కు కాళేశ్వరం కార్పొరేషన్‌ ద్వారా రుణాలు సమకూర్చుతున్నారు. ఈ ఒక్క కార్పొరేషన్‌ నుంచే రూ.95 వేల కోట్లకు పైగా లోన్లు తీసుకున్నారు. వరద కాలువ, దేవాదుల, సీతారామ లిఫ్ట్‌, సమ్మక్క సాగర్‌, సీతమ్మ సాగర్‌ బ్యారేజీల కోసం ఇరిగేషన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్షర్‌ కార్పొరేషన్‌ ద్వారా లోన్లు తెచ్చారు. ఈ ప్రాజెక్టుల కోసం ఇప్పటిదాకా రూ.24 వేల కోట్ల అప్పులు తీసుకున్నారు.