ఆయనతో కలిస్తే ఏ పార్టీ అయినా మటాషే: మంత్రి హరీశ్​

ఆయనతో కలిస్తే ఏ పార్టీ అయినా మటాషే: మంత్రి హరీశ్​
  • ఖమ్మంలో ఒక్క ఇరిగేషన్‌‌ ప్రాజెక్టయినా చేపట్టినట్లు 
  • బాబు నిరూపిస్తే ముక్కు నేలకు రాస్త: పువ్వాడ
  • కేసీఆర్‌‌ పాలనలో తామంతా సంతోషంగా ఉన్నామని వ్యాఖ్య
  • ఉద్యోగులను బాబు రాచి రంపాన పెట్టిండు:  శ్రీనివాస్​గౌడ్​

హైదరాబాద్‌, వెలుగు: టీడీపీ చీఫ్​ చంద్రబాబు నాయుడిది భస్మాసుర హస్తమని, 2018లో మహాకూటమి పేరుతో జట్టుకడితే కూటమే మటాష్‌ అయిందని, ఆయనతో కలిస్తే ఏ పార్టీకైనా ఆ పరిస్థితి తప్పదని మంత్రి హరీశ్​రావు విమర్శించారు. ‘నై తెలంగాణ’ అన్న చంద్రబాబు మెడలు వంచి జై తెలంగాణ అనిపించాం కాబట్టే 2009లో టీడీపీతో పొత్తు పెట్టుకున్నామని తెలిపారు. ఏపీలో బీజేపీతో పొత్తు కోసమే తెలంగాణలో చంద్రబాబు ప్రదర్శనకు దిగారని, ఖమ్మంలో సభ పేరుతో డ్రామా చేశారని ఆయన దుయ్యబట్టారు. గురువారం టీఆర్‌ఎస్‌ ఎల్పీలో మంత్రులు పువ్వాడ అజయ్‌, శ్రీనివాస్‌ గౌడ్‌, ఎమ్మెల్సీ ఎం.ఎస్‌. ప్రభాకర్‌ రావు తదితరులతో కలిసి హరీశ్​రావు మీడియాతో మాట్లాడారు. ‘‘ఖమ్మంలో చంద్రబాబు షో కూట్లో రాయి తీయలేనోడు ఏట్లో రాయి తీస్తానన్నట్టు ఉంది.. చచ్చిన బర్రె పగిలిపోయిన బుడ్డెడు పాలు ఇచ్చే అన్నట్టుగా ఉంది” అని విమర్శించారు. ఏపీని అప్పుల పాలు చేసి ఆ రాష్ట్ర ప్రజలతో ఛీత్కారానికి గురైన చంద్రబాబు తెలంగాణలో ఏం చేస్తారని, ఏపీలో చెల్లని రూపాయి ఇక్కడెలా చెల్లుతుందని ఆయన అన్నారు. తొమ్మిదేండ్లు సీఎంగా ఉండి తెలంగాణ ప్రాంతం వెనుకబడిపోయేలా చేసిందే చంద్రబాబు అని మండిపడ్డారు. ‘‘తెల్లారుతుందంటే.. కోడి కూస్తుందంటే తన వల్లేనని చంద్రబాబు చెప్పుకుంటడు. చంద్రబాబులా మాట్లాడితే తమ దేశంలోనైతే జైలుకు పంపుతామని గతంలో స్విట్జర్లాండ్‌ అధ్యక్షుడు చెప్పిండు” అని అన్నారు. హైదరాబాద్‌ ఫ్రీ జోన్‌ పేరుతో తెలంగాణ యువత నోట్లో మట్టి కొట్టారని, ప్రశ్నించిన యువతను నక్సలైట్ల పేరుతో కాల్చి చంపారని టీడీపీ చీఫ్​పై మండిపడ్డారు. కరెంట్‌ అడిగిన రైతులను బషీర్‌బాగ్‌ చౌరస్తాలో పిట్టల్లా కాల్చి చంపారని, ఉచిత కరెంట్‌ అంటే తీగలపై బట్టలు ఆరేసుకోవాలని రైతులను అవమానించారని, ఇరిగేషన్‌ ప్రాజెక్టులు కట్టకుండా తెలంగాణను ఎండబెట్టారని అన్నారు. కల్వకుర్తి నిర్మించకుండా చంద్రబాబు, వైఎస్‌ రాజశేఖర్​ రెడ్డి మహబూబ్‌ నగర్‌ జిల్లాకు నష్టం చేశారని హరీశ్​రావు దుయ్యబట్టారు. ఎన్టీఆర్‌ గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదన్నారు. ‘‘కరోనాకు వ్యాక్సిన్‌ కనిపెట్టిందే తాను అన్నట్టు చంద్రబాబు మాట్లాడుతున్నడు” అని విమర్శించారు. 

కల్లాల కోసం ఖర్చు చేస్తే వెనక్కి ఇవ్వాలనడం ఏమిటి?

రైతులు తమ పంట ఎండబెట్టుకోవడానికి కల్లాలు కట్టుకోవడమే తప్పు అన్నట్టుగా కేంద్రం వ్యవహరిస్తున్నదని హరీశ్‌ రావు  మండిపడ్డారు. కల్లాల కోసం ఖర్చు చేసిన రూ.150 కోట్లు తిరిగి చెల్లించాలని కేంద్రం హుకుం జారీ చేసిందని అన్నారు. కొన్ని రాష్ట్రాల్లో చేపలు ఆరబోసుకునేందుకు ప్లాట్‌ ఫాంల నిర్మాణానికి ఉపాధి హామీ పథకంలో అనుమతి ఇచ్చి, తెలంగాణలో మాత్రం పంట కల్లాలు నిర్మించుకోవద్దనడం  ఏమిటని ప్రశ్నించారు. కల్లాలపై కేంద్రం వైఖరిని మార్చుకునే వరకు బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో ఉద్యమిస్తామన్నారు. శుక్రవారం నిర్వహించే ధర్నాలను విజయవంతం చేసి కేంద్రానికి బుద్ధి చెప్తామని హెచ్చరించారు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్న కేంద్రం డీజిల్‌ సహా అన్నింటి ధరలు పెంచి పెట్టుబడి రెట్టింపు చేసిందని ఆయన 
దుయ్యబట్టారు.

ఖమ్మం జిల్లాకు నష్టం చేసిందే చంద్రబాబు: పువ్వాడ

ఏడు మండలాలు గుంజుకొని ఖమ్మం జిల్లాకు నష్టం చేసిందే చంద్రబాబు అని మంత్రి పువ్వాడ అజయ్‌  ఆరోపించారు. సీలేరు పవర్‌ ప్లాంట్‌ లాక్కోవడంతో పాటు తెలంగాణ ఏర్పడిన మొదట్లో హక్కుగా రావాల్సిన కరెంట్‌ కూడా ఇవ్వకుండా తీవ్ర నష్టం చేశారని అన్నారు. ‘‘అలాంటి చంద్రబాబు తానే ఖమ్మం అభివృద్ధి చేశానని చెప్పుకుంటున్నరు. కేసీఆర్‌ హయాంలోనే ఖమ్మం పట్టణంతో పాటు ఉమ్మడి జిల్లా అభివృద్ధి చెందింది. ఖమ్మంలో ఒక్క ఇరిగేషన్‌ ప్రాజెక్టయినా ప్రారంభించినట్టు చంద్రబాబు నిరూపించినా ముక్కు నేలకు రాస్తా”అని ఆయన సవాల్‌ విసిరారు. కేసీఆర్‌ పాలనలో తాము సంతోషంగా ఉన్నామని చెప్పారు. చంద్రబాబు సభ పెట్టిన గ్రౌండ్‌ చాలా చిన్నదని, ఆ మీటింగ్‌కు ఏపీ నుంచే సగం మందిని తరలించారని దుయ్యబట్టారు.

అసెంబ్లీలో తెలంగాణ పదాన్ని చంద్రబాబు నిషేధించిండు: శ్రీనివాస్​గౌడ్​

అసెంబ్లీలో తెలంగాణ పదాన్ని నిషేధించిన వ్యక్తి చంద్ర బాబు అని మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ అన్నారు. ‘‘సీఎంగా ఉన్నప్పుడు ఉద్యోగులను రాచిరంపాన పెట్టిండు. డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ చేయకుండా నిరుద్యోగుల పొట్ట కొట్టిండు. పాలమూరు పేదరికాన్ని ప్రపంచ బ్యాంకుకు చూపించి లోన్లు తెచ్చుకొని తన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకున్నడు. అంగన్‌వాడీ కార్యకర్తలను గుర్రాలతో తొక్కించిండు” అని ఆయన ఆరోపించారు.