రాష్ట్రంలో బీజేపీ వస్తే గిరిజన రిజర్వేషన్లపైనే ఫస్ట్ సైన్

రాష్ట్రంలో బీజేపీ వస్తే గిరిజన రిజర్వేషన్లపైనే ఫస్ట్ సైన్

విభజన సమస్యలను 2 రాష్ట్రాలు పరిష్కరించుకోవాలె: కిషన్ రెడ్డి

న్యూఢిల్లీ, వెలుగు: హుజురాబాద్ ఉప ఎన్నిక తర్వాత దళిత బంధుకు అతీగతీ లేదని, మునుగోడు బైపోల్ తర్వాత గిరిజన బంధు పరిస్థితి కూడా అంతేనని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. మునుగోడు ఉప ఎన్నికలో గెలుపు కోసమే సీఎం కేసీఆర్ గిరిజన బంధును తెరపైకి తెచ్చారన్నారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే గిరిజన రిజర్వేషన్ల పెంపు ఫైల్ పైనే తొలి సంతకం ఉంటుందని ప్రకటించారు. టీఆర్ఎస్ సర్కార్ గిరిజన రిజర్వేషన్లను మతపరమైన రిజర్వేషన్లతో కలిపిందని, ఆ లింక్ ను తొలగించి, కేంద్రం ప్రమేయం లేకుండా ఇక్కడే సమస్యను పరిష్కరిస్తామన్నారు. ముస్లిం రిజర్వేషన్లతో లింక్ పెట్టడాన్ని హైకోర్టు కూడా తప్పుపట్టిందన్నారు. సోమవారం ఢిల్లీలోని తన నివాసంలో కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కొత్త పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలన్న ఆలోచనతో ఏకీభవిస్తున్నానని, దీనిని కేంద్ర కేబినెట్ మీటింగ్​లో ప్రస్తావిస్తానని చెప్పారు. తెలుగు రాష్ట్రాల సీఎంలు కలిసి భోజనాలు చేస్తారు కానీ, ఇరు రాష్ట్రాల సమస్యలను కలిసి పరిష్కరించుకోరా? అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. విభజన సమస్యలపై నోడల్ ఆఫీస్ అయిన కేంద్ర హోం శాఖ అనేక సార్లు ఇరు రాష్ట్రాల అధికారులతో భేటీలు నిర్వహించినా ఏకాభిప్రాయానికి రాలేదన్నారు. జల వివాదాల పరిష్కారంపై గెజిట్ రిలీజ్ చేస్తే కేంద్ర పెత్తనం ఏంటని ప్రశ్నించారని తెలిపారు. విభజన చట్టంలో పేర్కొన్నట్లుగా బయ్యారం స్టీల్ ప్లాంట్ వయోబిలిటీ కాదని, దీనితో ప్రజాధనం వృధా అవుతుందన్నారు.   

నేడు కర్తవ్య పథ్​లో బతుకమ్మ సంబురాలు

ఢిల్లీలోని ఇండియా గేట్ ముందున్న కర్తవ్యపథ్​లో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో మంగళవారం బతుకమ్మ సంబురాలు చేపడతామని కిషన్ రెడ్డి వెల్లడించారు. సాయంత్రం 6 గంటలకు వేడుకలు ప్రారంభం అవుతాయన్నారు. సంబురాల్లో కేంద్ర మంత్రులు, వారి కుటుంబ సభ్యులు, ఢిల్లీలోని మహిళా ఐఏఎస్ లు, ఐపీఎస్ లు, కేంద్ర ప్రభుత్వ విభాగాల హెచ్ఓడీలకు ఆహ్వానం పంపామన్నారు. తెలంగాణ నుంచి 180 మంది మహిళలు పాల్గొంటున్నట్లు వెల్లడించారు.