బీజేపీ గెలిస్తే దేశానికి ప్రమాదమే : ఉత్తమ్

బీజేపీ గెలిస్తే దేశానికి ప్రమాదమే : ఉత్తమ్

  కేంద్రంలో బీజే‌‌పీ మళ్లీ అధికారంలోకి వస్తే దేశం ప్రమాదంలో పడుతుందని మంత్రి ఉత్తమ్​అన్నారు. ఇప్పటికే సిట్టింగ్ సీఎంలు,  ప్రతిపక్ష పార్టీల నేతలను ఈడీ, ఐటీ ద్వారా అణచివేస్తుందని చెప్పారు. దేశ భవిష్యత్తుకు 2024 పార్లమెంటు ఎన్నికలు కీలకమని, బీజేపీని ఓడిస్తేనే దేశంలో స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం నిలబడుతాయని తెలిపారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు పదేండ్లు అధికారంలో ఉన్న బీజేపీ దేశానికి, రాష్ట్రానికి చేసిందేమి లేదన్నారు.  మతపరంగా దేశాన్ని విచ్ఛిన్నం చేసి రాజకీయ లబ్ధి పొందుతోందని ఆరోపించారు. 

కరెంట్​పైనా అసత్య ప్రచారం

బీఆర్ఎస్ నేతలు కరెంట్ పైనా అసత్య ప్రచారాలు చేస్తున్నారని మంత్రి ఉత్తమ్​మండిపడ్డారు. జనరేటర్ ఆన్​చేసి కరెంట్ లేదని బద్నాం చేయడం వారి దిగజారుడు తనమేనన్నారు. తాము రైతుల కోసమే పని చేస్తున్నామని, వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కరెంటు డిమాండ్ పెరిగినప్పటికీ 24 గంటల విద్యుత్తు, మంచినీరు అందిస్తున్నామని తెలిపారు. 

కరెంట్ సప్లై, డిమాండ్ పెరిగినా విద్యుత్ కోతలు ఉండవని స్పష్టం చేశారు. పదేండ్లలో బీఆర్ఎస్ ఇచ్చిన హామీలను అమలు చేయలేదని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 100రోజుల లోపే హామీలను అమలు చేసిందన్నారు. బీఆర్ఎస్​ నేతలు  ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడి రాజకీయ నాయకులు, సినిమా, వ్యాపారుల నుంచి డబ్బులు వసూలు చేశారని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడిన కే‌‌టీ‌‌ఆర్ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు.