కోర్టు టైమింగ్స్​పై జస్టిస్ లలిత్ వ్యాఖ్యలు

కోర్టు టైమింగ్స్​పై జస్టిస్ లలిత్ వ్యాఖ్యలు

న్యూఢిల్లీ: కోర్టు టైమింగ్స్​పై సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యూయూ లలిత్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. చిన్న పిల్లలే రోజూ ఉదయం 7 గంటలకు స్కూల్​కు వెళ్తుంటే.. లాయర్లు, జడ్జిలు కోర్టుకు 9 గంటలకు ఎందుకు రాలేరని కామెంట్ చేశారు. సుప్రీం కోర్టు, ఇతర కోర్టులు 9 గంటలకు డ్యూటీ ప్రారంభించాలని ఆయన సూచించారు. జడ్జిలు లలిత్, ఎస్ రవీంద్ర భట్, సుధాన్షు ధులియాతో కూడిన బెంచ్ శుక్రవారం ఉదయం 9.30 గంటలకే కోర్టుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా కేసు వాదించేందుకు వచ్చిన సీనియర్ లాయర్ ముకుల్ రోహిత్గీ.. కోర్టు టైమింగ్స్​ కంటే గంట ముందుగానే జడ్జిలు రావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.

జస్టిస్ లలిత్ స్పందిస్తూ.. ‘‘చిన్న పిల్లలు ఉదయం 7 గంటలకే స్కూల్​కు వెళ్లగలుగుతున్నారు. మనం ఎందుకు 9 గంటలకు రాలేం? ఇదే సరైన సమయం. కోర్టులు తొమ్మిదికే విచారణ ప్రారంభిం చి, 11.30కు అరగంట విరామం తీసుకోవచ్చు. మధ్యాహ్నం 2 గంటల లోపు ఆ రోజు పనిని ముగించవచ్చు. ఇలా చేస్తే మరుసటి రోజు విచారించాల్సిన కేసు ఫైళ్లను చదవడానికి ఎక్కువ టైం దొరుకుతుంది.”అని అన్నారు.