తెలంగాణలో కాంగ్రెస్ వస్తే అరాచకమే: కిషన్ రెడ్డి

తెలంగాణలో కాంగ్రెస్ వస్తే అరాచకమే: కిషన్ రెడ్డి
  • డిసెంబర్ 3న ‘కారు’ చీకట్లు పోతాయని కామెంట్

హైదరాబాద్, వెలుగు : కర్నాటకలో ఐదేళ్లల్లో  జరగాల్సిన నష్టం ఐదు నెలల్లోనే జరిగిపోయిందని బీజేపీ స్టేట్​చీఫ్, కేంద్రమంత్రి కిషన్​రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ వస్తే అరాచకమేనని హెచ్చరించారు. డిసెంబర్​3న ‘కారు’ చీకటిని తొలగించి అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. శనివారం గోషామహల్​ బీఆర్ఎస్ ​నేత ప్రేమ్​సింగ్​ రాథోడ్​బీజేపీలో చేరారు. కిషన్​రెడ్డి ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా నాగార్జునసాగర్​నియోజకవర్గానికి చెందిన పలువురు నేతలు కూడా  బీజేపీలో  చేరారు. అనంతరం కిషన్​రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల్లో  సీఎం కేసీఆర్, కేటీఆర్ ఓడిపోవడం ఖాయమన్నారు.

కేసీఆర్ కుటుంబ అక్రమ సంపదను కక్కిస్తామన్నారు. అవినీతి, కుట్ర, మోసపూరిత పార్టీల నుంచి రాష్ట్ర ప్రజలను కాపాడాల్సిన బాధ్యత తమపై ఉందని తెలిపారు. రాష్ట్రంలో  కటుంబ, అవినీతి, నియంతృత్వ చీకటి అలుముకుందని వెల్లడించారు. తమ కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు మజ్లిస్​తో కలిసేది లేదని స్పష్టం చేశారు. కేసీఆర్ తనకు ఒకవైపు అసద్, ఇంకో వైపు అక్బర్​ను పెట్టుకొని తిరుగుతున్నాడని కిషన్ రెడ్డి విమర్శించారు. కాగా..ప్రముఖ సినీ నటుడు చంద్రమోహన్​మృతికి కిషన్​రెడ్డి ఒక ప్రకటనలో సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు తన సానుభూతిని తెలియజేశారు.