టికెట్ ఇస్తే ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్త

టికెట్ ఇస్తే ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్త
  •  బీఆర్ఎస్  నేత దాసోజు శ్రవణ్ 
  • గుజరాత్ మోడల్ అంటే గోద్రానా? 
  • కాళేశ్వరంపై బట్ట కాల్చి 
  • మీదేస్తున్నారని కామెంట్

హైదరాబాద్, వెలుగు: తమ పార్టీ అధినేత కేసీఆర్  టికెట్ ఇస్తే లోక్ సభ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయడానికి రెడీగా ఉన్నానని బీఆర్ఎస్  హైదరాబాద్ ఇన్ చార్జి దాసోజు శ్రవణ్  అన్నారు. సికింద్రాబాద్  నుంచి పోటీ చేస్తానని ఆయన చెప్పారు. మంగళవారం తెలంగాణ భవన్ లో మీడియాతో ఆయన మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీని సీఎం రేవంత్ రెడ్డి బడా భాయ్  అన్నారని, రాష్ట్రంలో గుజరాత్  మోడల్ ను అమలు చేస్తామని అంటున్నారని, గుజరాత్  మోడల్  అంటే మరొక గోద్రా కావాలా అని శ్రవణ్  ప్రశ్నించారు. మోదీకి,- రేవంత్ కు మధ్య జుగల్ బందీ ఏందో ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు. 

‘‘రాహుల్ గాంధీ  ఏమో మోదీని వ్యతిరేకిస్తాడు. మరోవైపు రేవంత్  ఏమో సహాయ సహకారాలు కావాలని మోదీని అడుగుతాడు. ఇదేందో అర్థం కావడం లేదు. మోదీ, రేవంత్  మధ్య పొత్తుకు ఇది నిదర్శనం. మూడు నెలల్లో 30 వేల ఉద్యోగాలు ఇచ్చామని నిస్సిగ్గుగా రేవంత్  మాట్లాడుతున్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలు రేవంత్  రెడ్డి తన ఖాతాలో వేసుకోవడం నయవంచన కాదా?  ఇక కాళేశ్వరం కుంగుబాటుపైనా రేవంత్  బట్టకాల్చి తమ మీద వేస్తున్నారు” అని శ్రవణ్​ వ్యాఖ్యానించారు. 

పాత నోటిఫికేషన్లకు మరికొన్ని జాబులు కలిపి ఉద్యోగాలు ఇస్తున్నామని నిరుద్యోగులను కొత్త ప్రభుత్వం మోసం చేస్తోందని ఆయన విమర్శించారు.
ఎల్ఆర్ఎస్ అమలు చేయాలని నేడు నిరసనలు ఉచితంగా ఎల్ఆర్ఎస్  అమలు చేయాలని కోరుతూ హైదరాబాద్ లో బుధవారం నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని బీఆర్ఎస్  ప్రకటించింది. బుధవారం ఉదయం 10.30 గంటలకు జీహెచ్ఎంసీ హెడ్డాఫీసు ముందు ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్, మాగంటి గోపినాథ్, కాలేరు వెంకటేశ్, దానం నాగేందర్, ముఠా గోపాల్, మేయర్  గద్వాల విజయలక్ష్మితో పాటు ఆయా నియోజకవర్గాల నేతలు పాల్గొంటారని ఓ ప్రకటనలో తెలిపింది.