నాలాకు అడ్డు గా ఉంటే .. నా ఇంటిని కూల్చేయండి: ఎమ్మెల్యే అరూరి రమేష్

నాలాకు అడ్డు గా ఉంటే .. నా ఇంటిని కూల్చేయండి: ఎమ్మెల్యే అరూరి రమేష్

ఆఫీసర్లకు చెప్పిన వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్

మీటింగ్ లో వెల్లడించిన చీఫ్‍ విప్‍ వినయ్ భాస్కర్‍

వరంగల్‍ రూరల్‍, వెలుగు: హన్మకొండ హంటర్ రోడ్డులో నాలా ప్రవాహానికి తన ఇల్లు అడ్డుగా ఉంటే కూల్చేయవచ్చని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ అధికారులకు ఫోన్‍ చేసి చెప్పారు. ఈ విషయాన్ని ప్రభుత్వ చీఫ్‍ విప్‍ వినయ్ భాస్కర్‍ కన్​ఫర్మ్​ చేశారు. ‘వెలుగు’ పత్రికలో శుక్రవారం ‘నాలాలపైనే లీడర్ల ఇండ్లు..అయినా కూలుస్తలేరు’ హెడ్డింగ్ స్టోరీ పబ్లిష్ అయింది. విషయం కేటీఆర్‍ దాకా వెళ్లడంతో అప్పటికప్పుడు కొందరు లీడర్లు స్పందించారు.

హన్మకొండ అంబేద్కర్‍ భవన్‍లో శుక్రవారం గ్రేటర్‍ మున్సిపల్‍ కార్పొరేషన్‍ కౌన్సిల్‍ మీటింగ్‍ నిర్వహించారు. నాలాల కూల్చివేతకు ఏర్పాటు చేసిన టాస్క్​ఫోర్స్​ టీంకు చైర్మన్‍గా వ్యవహరిస్తున్న అర్బన్‍ కలెక్టర్‍ రాజీవ్ గాంధీ హన్మంతుతో పాటు మేయర్‍ గుండా ప్రకాశ్, ఎమ్మెల్యేలు దాస్యం వినయ్ భాస్కర్‍, చల్లా ధర్మారెడ్డి, అరూరి రమేశ్‍ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ చీఫ్‍ విప్‍ వినయ్ భాస్కర్‍ నాలాల ఆక్రమణ, కూల్చివేతల అంశంపై మాట్లాడుతూ.. నాలా ప్రవాహానికి అడ్డుగా ఉన్న ప్రతి నిర్మాణాన్ని కూల్చివేయడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇందులో భాగంగానే వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్‍ శుక్రవారం హంటర్ రోడ్డులోని తన ఇల్లు కమ్ క్యాంపు ఆఫీస్‍ వద్దకు వెళ్లి నాలా ప్రవాహానికి నిర్మాణం ఎలా అడ్డుపడుతుందో స్వయంగా గమనించారని అన్నారు. రిజిస్టర్డ్ డాక్యుమెంట్ లు ఉన్నా ప్లాట్‍ కంటే.. ప్రజా శ్రేయస్సు ముఖ్యమని భావించి వెంటనే ఆయన అధికారులకు ఫోన్‍ చేసినట్లు పేర్కొన్నారు. దీంతో ఇక లీడర్ల ఆక్రమణలను తొలగించడంలో టాస్క్​ఫోర్స్​ ఆఫీసర్లదే ఆలస్యమని సిటీ ప్రజలు చర్చించుకుంటున్నారు.