కేసీఆర్, కేటీఆర్​కు దమ్ముంటే.. ఓయూలో మీటింగ్​ పెట్టి ఓట్లడగాలె..

కేసీఆర్, కేటీఆర్​కు దమ్ముంటే.. ఓయూలో మీటింగ్​ పెట్టి ఓట్లడగాలె..
  • పది రోజుల్లోనే వివేక్​ వేల కోట్లు సంపాదించారా?
  • ఎన్నికలకు ముందు  రైతుబంధుకు అనుమతెట్లా ఇస్తరు ?
  • బీజేపీ, బీఆర్ఎస్, ఈసీ ఒక్కటే  
  • సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ ​వర్కింగ్​ప్రెసిడెంట్​కేటీఆర్​కు దమ్ముంటే ఉస్మానియా యూనివర్శిటీలో మీటింగ్​పెట్టి ఓట్లడగాలని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ సవాల్​ విసిరారు. కొత్తగూడెంలోని శేషగిరిభవన్​లో ఆదివారం విలేకరులతో మాట్లాడారు.  ‘బీజేపీ నుంచి కాంగ్రెస్​లో చేరిన పది రోజుల్లోనే వివేక్​రూ. వేల కోట్లు సంపాదించారా? ఇంత కన్నా విడ్డూరం ఎక్కడైనా ఉందా? పది రోజుల్లోనే వివేక్​ ఆర్థిక నేరస్థుడయ్యారా?’ అని ప్రశ్నించారు. కేసీఆర్​ నిమ్స్​లో దీక్ష చేస్తున్న టైంలో పరామర్శించేందుకు, అదే టైంలో కేటీఆర్​, హరీశ్​రావు, కవిత వచ్చారని దీక్ష విరమించకపోతే ప్రాణానికే ప్రమాదముంటుందని ఆందోళన చెందారన్నారు. పరిస్థితి తెలుసుకున్న సోనియా గాంధీ తెలంగాణ ప్రకటించి కేసీఆర్​కు ప్రాణం పోశారన్నారు. కేసీఆర్​మాత్రం సోనియాను మోసం చేశాడని విమర్శించారు. బీసీని సీఎం చేస్తామని చెప్తున్న బీజేపీ..బీసీ అయిన బండి సంజయ్​ని ఎందుకు అధ్యక్ష పదవి నుంచి తొలగించిందో చెప్పాలన్నారు. లిక్కర్​స్కాం నుంచి కవితను కాపాడడంతో పాటు బండి సంజయ్​ను రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తొలగించడంపై అమిత్​షాతో కేసీఆర్​చర్చించారన్నారు.

పోలింగ్​కు కొన్ని రోజుల ముందు రైతు బంధు డబ్బులను ఖాతాల్లో వేసేందుకు ఈసీ అనుమతి ఇవ్వడం కేసీఆర్ ​కుట్రలో భాగమేనన్నారు. బీఆర్ఎస్​ చెప్పిందే బీజేపీ చేస్తోందని, బీజేపీ చెప్పిందే ఈసీ చేస్తుందన్నారు. ఉద్యోగస్తులు బీఆర్ఎస్​ ​కు వ్యతిరేకంగా ఉన్నారని వారికి పోస్టల్ ​ఓటింగ్​ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. కొత్తగూడెంలో బీఆర్ఎస్​ తరుపున పోటీ చేస్తున్న వనమా వెంకటేశ్వరరావు మరోసారి గెలిస్తే ఆయన కొడుకు అగడాలు, భూ కబ్జాలకు అంతులేకుండా పోతుందన్నారు. బీ ఫారం కొనుక్కొని వచ్చిన మరో అభ్యర్థి జలగం వెంకట్రావ్​కు ఓటేస్తే ప్రజలు నష్టపోతారన్నారు. కాంగ్రెస్, సీపీఎం, టీడీపీ, టీజేఎస్​మద్దతుతో సీపీఐ తరుపున పోటీ చేస్తున్న ప్రజల మనిషి కూనంనేని సాంబశివరావును గెలిపించాలన్నారు..