హైదరాబాద్, వెలుగు: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇంగితం మరిచి సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు చేస్తున్నారని ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ మండిపడ్డారు. శనివారం ఆయన సీఎల్పీ మీడియా సెంటర్ లో మాట్లాడారు. సీఎం హెలికాప్టర్ లో వెళ్లడంపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అక్కసు వెళ్లగక్కుతున్నారని, గత ప్రభుత్వ హయాంలో కేసీఆర్ తో పాటు సీఎంవో అధికారులు కూడా హెలికాప్టర్లు వాడిన విషయం తెలియదా..? అని ప్రశ్నించారు.
కేసీఆర్ కుటుంబం కోసం గతంలో 30 బుల్లెట్ ప్రూఫ్ కార్లు తయారు చేయించిన సంగతి మర్చిపోయారా అని నిలదీశారు. రేవంత్ రెడ్డి తన భద్రతను కూడా పక్కన పెట్టి, కేవలం మూడు వాహనాల కాన్వాయ్‌తో సామాన్యుడిలా ప్రయాణిస్తున్నారని గుర్తు చేశారు. పాలనపై సీఎం రేవంత్ రెడ్డితో చర్చ కావాలంటే బీఆర్ఎస్ నాయకులు కేసీఆర్‌ను తీసుకురావాలని అద్దంకి సవాల్ విసిరారు.
కేసీఆర్‌ను బయటకు తీసుకొచ్చే సత్తా ఉంటే ఎక్కడైనా చర్చకు సిద్ధమని, రేవంత్ ను తాము తీసుకొస్తామని స్పష్టం చేశారు. కేసీఆర్ హయాంలో చేసిన అప్పులకు నెలకు రూ. 6,500 కోట్ల వడ్డీలు కడుతున్నామని..రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చూసి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆవేదన చెందుతున్నారని తెలిపారు. తెలంగాణ ప్రజలకు ముఖం చూపించలేకనే కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో పడుకున్నారని ఎద్దేవా చేశారు.
బీఆర్ఎస్ పార్టీ త్వరలోనే కనుమరుగు కాబోతోందని, సొంత ఇంట్లోనే విభేదాలు మొదలయ్యాయని, కవిత బయటకు వెళ్లి వేరే పార్టీ పెట్టుకుందన్నారు. హరీశ్ రావు బీజేపీ వైపు చూస్తున్నారని, ఆయనకు కూడా సీఎం కావాలనే ఆశ ఉందన్నారు. అటు కేటీఆర్ కూడా తన అనుచరులతో సీఎం అని నినాదులు చేయించుకుంటున్నారని విమర్శించారు. కాంగ్రెస్ నాయకుల మధ్య తగాదాలు పెట్టాలని బీఆర్ఎస్ నేతలు చూస్తున్నారని, కానీ సీనియర్లందరూ రేవంత్ రెడ్డి నాయకత్వంలో కలిసి పనిచేస్తున్నారని అద్దంకి స్పష్టం చేశారు.
