
కోహ్లీని రెచ్చగొట్టొద్దన్నది మా స్ట్రాటజీ
ఐపీఎల్ కోసం కాదు.. అతడిని కామ్‌గా ఉంచేందుకే కవ్వించలేదు
ఆస్ట్రేలియా టెస్ట్ కెప్టెన్ టిమ్ పైన్
హోబర్ట్: ఐపీఎల్ కాంట్రాక్టుల కోసం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని స్లెడ్జింగ్ చేసేందుకు తమ క్రికెటర్లు భయపడ్డారన్న మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్
విమర్శలను ఆస్ట్రేలియా టెస్ట్ టీమ్ కెప్టెన్ టిమ్ ఫైన్ ఖండించాడు. కోహ్లీని కామ్‌గా ఉంచాలన్న స్ట్రాటజీలో భాగంగానే అతడిని కవ్వించే ప్రయత్నం చేయలేదని, అంతే తప్ప ఐపీఎల్ గురించి కాదని స్పష్టం చేశాడు. ఐపీఎల్ కోసం తమ ఆటగాళ్లు విరాట్‌ను ఔట్ చేయకూడదని గానీ, అతడితో మర్యాదగా ఉన్న సందర్భాలు గానీ తన దృష్టికి రాలేదని చెప్పాడు. ‘మా వాళ్లలో కోహ్లీతో ఎవరు నైస్‌గా ఉన్నారో నాకు కచ్చితంగా తెలియదు. అయితే, కోహ్లీని రెచ్చగొడితే మరింత బాగా ఆడతాడు కాబట్టి మేం అతడిని కవ్వించకూడదని అనుకున్నాం ’ అని పైన్ స్పష్టం చేశాడు. ఇక, ఈ ఏడాది చివర్లో టీమిండియా ఆస్ట్రేలియా టూర్ జరుగుతుందో లేదో ఇప్పుడు ఎవ్వరూ చెప్పలేరని అన్నాడు. అలాగే, ప్రస్తుతానికి తన ఫోకస్
ఐపీఎల్‌పై లేదన్నాడు. అది జరిగినా జరగకపోయినా తనకు ఒరిగేదేమీ లేదన్నాడు. ‘ఆస్ట్రేలియా తరఫున మా కుర్రాళ్లు ఎప్పుడు టెస్టుమ్యాచ్ ఆడినా వాళ్ల బెస్ట్ ఇస్తారు. అలాగే, కోహ్లీకి ఎదురుపడ్డప్పుడు, అతనికి బౌలింగ్ చేసినప్పుడు మా వాళ్లు ఐపీఎల్ గురించి అస్సలు ఆలోచించరని నేను నమ్ముతాను’ అని పైన్ చెప్పుకొచ్చాడు.