సింగరేణిలో సార్వత్రిక సమ్మె సక్సెస్..గనుల్లో నిలిచిన బొగ్గు ఉత్పత్తి 

సింగరేణిలో సార్వత్రిక సమ్మె సక్సెస్..గనుల్లో నిలిచిన బొగ్గు ఉత్పత్తి 
  • 4 లేబర్​ కోడ్​లను రద్దు చేయాలంటూ రోడ్డెక్కిన కార్మిక నాయకులు, కార్మికులు

కోల్​బెల్ట్/గోదావరిఖని, వెలుగు: కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన నాలుగు లేబర్​ కోడ్​లను రద్దు చేయాలని డిమాండ్​చేస్తూ జాతీయ కార్మిక సంఘాలు తలపెట్టిన సార్వత్రిక సమ్మె గురువారం సింగరేణిలో విజయవంతమైంది. సంస్థ అన్ని ఏరియాల్లో కార్మికులు విధులకు హాజరుకాలేదు. మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల పరిధి బెల్లంపల్లి రీజియన్​లోని మందమర్రి, శ్రీరాంపూర్, బెల్లంపల్లి ఏరియాల్లో 10 అండర్ గ్రౌండ్ బొగ్గు గనులు, 4 ఓపెన్​కాస్ట్​ గనుల్లో అత్యవసర సిబ్బంది మినహా ఎవరూ కనిపించలేదు.  

సింగరేణి గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాలైన ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీతోపాటు సీఐటీయూ, ఐఎఫ్​టీయూ, హెచ్ఎంఎస్ నాయకులు, కాంట్రాక్టు కార్మికులు సమ్మెకు మద్దతు ఇచ్చారు.  బెల్లంపల్లి రీజియన్​లోని శ్రీరాంపూర్, ఇందారం, కల్యాణిఖని, ఖైరీగూడ ఓసీపీల్లో బుధవారం రాత్రి షిఫ్టు విధులకు వెళ్లిన ఈపీ ఆపరేటర్లుకు యాజమాన్యం అక్కడే వసతి ఏర్పాట్లు చేసింది. గురువారం వారిని ఇండ్లకు పంపకుండా మొదటి షిఫ్టులో విధులు నిర్వ ర్తించేలా ఆఫీసర్లు చర్యలు తీసుకున్నారు. అయితే బొగ్గు ఉత్పత్తి సాధ్యం కాలేదు. ఒక్కరోజు సమ్మెతో బెల్లంపల్లి రీజియన్​లో సుమారు 35 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి నష్టం జరిగింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు.

4 లేబర్ ​కోడ్​లను రద్దు చేయాలి

కార్మికులు పోరాడి సాధించుకున్న 29 చట్టాల స్థానంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 4 లేబర్ కోడ్​లు తీసుకురావడం అన్యాయమని కార్మిక సంఘాల జేఏసీ నేతలు వాసిరెడ్డి సీతారామయ్య, జె.శంకర్​రావు, రాజారెడ్డి, కేతిరెడ్డి సురేందర్​రెడ్డి, తిప్పని సారయ్య అన్నారు. శ్రీరాంపూర్ బస్టాండ్​వద్ద రహదారిపై వేర్వేరుగా ధర్నాలు చేపట్టారు. లేబర్​కోడ్​ల వల్ల ఇకముందు పర్మినెంట్​ఉద్యోగాలు, వేతనాల పెరుగుదల, కార్మిక సంఘాలు, సమ్మె హక్కు ఉండవన్నారు. వాటిని రద్దు చేయకపోతే సింగరేణి నిరవధిక సమ్మెకు కూడా వెనుకాడబోమన్నారు. 

రామగుండం రీజియన్​లో.. 

రామగుండం రీజియన్​పరిధిలోని 4 ఓపెన్​ కాస్ట్​లు, 8 భూగర్భ గనుల్లో కార్మికులు విధులకు హాజరుకాకపోవడంతో బొగ్గు ఉత్పత్తి, రవాణా నిలిచిపోయింది. బీఎంఎస్ మినహా అన్ని జాతీయ, ప్రాంతీయ కార్మిక సంఘాల ప్రతినిధులు గురువారం ఉదయమే గనుల వద్దకు చేరుకొని, కేంద్ర ప్రభుత్వ విధానాలపై నిరసన తెలిపారు. ఏఐటీయూసీ అధ్యక్షుడు వి.సీతారామయ్య, నాయకులు మడ్డి ఎల్లయ్య, ఆరెల్లి పోచం, ఐఎన్​టీయూసీ వైస్ ప్రెసిడెంట్​కె.సదానందం, టీబీజీకేఎస్​అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి, మాదాసు రామ్మూర్తి, సీఐటీయూ ప్రధాన కార్యదర్శి టి.రాజారెడ్డి, మెండె శ్రీనివాస్, హెచ్ఎంఎస్​ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్, ఇఫ్టూ అధ్యక్షుడు కె.విశ్వనాథ్, ఐ.కృష్ణ తదితరులు పాల్గొన్నారు.