ఎల్‌‌ఆర్‌‌‌‌ఎస్ ఫ్రీగా చేయకుంటే..ప్రజలకు క్షమాపణ చెప్పండి

ఎల్‌‌ఆర్‌‌‌‌ఎస్ ఫ్రీగా చేయకుంటే..ప్రజలకు క్షమాపణ చెప్పండి
  •  సీఎం రేవంత్‌‌కు కేటీఆర్‌‌‌‌ లేఖ

హైదరాబాద్, వెలుగు: ఎల్‌‌ఆర్‌‌‌‌ఎస్‌‌ ఫ్రీగా చేయాలని, లేదంటే ప్రజలకు క్షమాపణ చెప్పాలని సీఎం రేవంత్‌‌రెడ్డిని బీఆర్‌‌‌‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌‌ డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం రేవంత్‌‌కు కేటీఆర్‌‌ లేఖ రాశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను గౌరవిస్తూ ఎల్ఆర్ఎస్ పథకంలో ఎలాంటి చార్జీలు లేకుండా భూముల రెగ్యులరైజేషన్ కు మార్గదర్శకాలను వెంటనే విడుదల చేయాలని లేఖలో పేర్కొన్నారు. 25.44 లక్షల దరఖాస్తుదారుల కుటుంబాలకు జరిగే లబ్ధిని దృష్టిలో ఉంచుకోవాలన్నారు. 

ఎల్‌‌ఆర్‌‌‌‌ఎస్ ఉచితంగా చేస్తామని మంత్రులు భట్టి విక్రమార్క, ఉత్తమ్‌‌కుమార్‌‌‌‌రెడ్డి, సీతక్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గతంలో హామీ ఇచ్చారని కేటీఆర్ గుర్తుచేశారు. అప్పుడు తమ ప్రభుత్వం ఎల్‌‌ఆర్‌‌‌‌ఎస్ అమలు చేస్తున్నప్పుడు, ఇదో దోపిడీగా అభివర్ణించిన కాంగ్రెస్‌‌.. ఇప్పుడు ప్రజల నుంచి చార్జీల రూపంలో ఎందుకు దోపిడీ చేస్తుందో చెప్పాలన్నారు. 

రాష్ట్రంలో ఉన్న 25.44 లక్షల కుటుంబాలపైన ఆర్థిక భారం మోపుతున్న ప్రభుత్వం.. ప్రజా ప్రభుత్వం ఎలా అవుతుందని కేటీఆర్‌‌‌‌ ప్రశ్నించారు. ప్రజల నుంచి రూ.20వేల కోట్ల రూపాయల డబ్బులను గుంజుకుంటున్నరు కాబట్టి, ఇది దయలేని ప్రభుత్వం అవుతుందన్నారు. ఎల్‌‌ఆర్‌‌‌‌ఎస్ కోసం చార్జీలు వసూలు చేస్తే, గతంలో ఇచ్చిన మాట తప్పినందుకు తొలుత ప్రజలకు క్షమాపణలు చెప్పాలని కేటీఆర్‌‌‌‌ సీఎంను డిమాండ్ చేశారు.