సరిగ్గ తినకుంటే... ప్రమాదకరమైన జబ్బులు..!

సరిగ్గ తినకుంటే...  ప్రమాదకరమైన జబ్బులు..!


ఈటింగ్ డిజార్డర్. తక్కువ తినడం.లేదంటే ఎక్కువగా తినడం. లావైపోతున్నామనే యాంగ్జైటీతో అసలే తినకపోవడం. ఇవన్నీ ఈటింగ్ డిజార్డర్సే.12 నుంచి 35 యేళ్లలోపు ఆడవాళ్లలో ఈ యాంగ్జైటీ ఎక్కువగా ఉంటుందని తాజాగా ఓ సర్వే చెప్పింది. ఫిజిక్ మెయింటెయిన్ చేయాలనే ఆరాటంతో హెవీ డైటింగ్ చేస్తుంటారు కొందరు. దీనివల్ల ఈటింగ్ డిజార్డర్ కు గురవుతున్నారు. ఇదే కొనసాగితే భవిష్యత్తులో ప్రమాదకరమైన జబ్బులు వచ్చే ఛాన్స్ ఉందని అంటు న్నారు ఎక్స్పర్ట్స్. 

‘‘లావుగా ఉన్నాను అందుకే నేను తక్కువ తింటున్నా’’,‘‘ఎక్కువగా ఫుడ్ తింటే లావైపోతాం. అందుకే తక్కువ తినాలి’’. అనే మాటలు మన చుట్టూ తరచూ వినిపిస్తుంటాయి. ముఖ్యంగా చదువుకునే పిల్లలు ఫిజిక్పై ఉన్న శ్రద్ధతో డైట్ కంట్రోల్ చేస్తుంటారు. ఫ్యాట్స్, కార్బొహైడ్రేట్స్, ప్రొటీన్స్ ఉండే ఫుడ్ తినడం బాగా తగ్గిస్తారు. మరికొంతమంది తక్కువ తినడం లేదంటే ఎక్కువ తినడం చేస్తారు. దీన్నే ఈటింగ్ డిజార్డర్ అంటారు. ఇందులో అనొరెక్సియా, బులీమియా, బింజే అనే మూడు రకాల డిజార్డర్స్ ఉన్నాయి. ఇవన్నీ యాంగ్జైటీకి సంబంధించినవే. 

అనోరెక్జియా నెర్వోసా 

తక్కువ తినడం. లేదంటే అసలే తినకపోవడం. ఇవి అనోరెక్జియా లక్షణాలు. ఈ లక్షణాలు ఉన్నవాళ్లు బరువు ఎక్కువగా ఉంటారు. లేదంటే అండర్ వెయిట్లో ఉంటారు. చూడడానికి లావుగా ఉన్నామనో, లేదంటే బాగా సన్నగా కనిపిస్తున్నామనో సరిగా తిండి తినరు. మరికొంత మంది తక్కువగా తినాలి అంటూనే వాళ్లకే తెలియకుండా ఎక్కువ తినేస్తుంటారు. కానీ, వాళ్లు చాలా తక్కువ తిన్నాం అనే ఫీలింగ్లో ఉంటారు. అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్( ఓసిడి)తో బాధపడే ఆడవాళ్లలో ఈ లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. 

బులీమియా నెర్వొసా 

ఎక్కువగా తినడం. అంటే ఇష్టమొచ్చినట్టు తిని, తరువాత ఇబ్బంది పడటం. ఇదే బులీమియా. ఇది రెగ్యులర్గా వచ్చే ఈటింగ్ డిజార్డర్. ఆకలి ఉన్నదానికంటే ఎక్కువ తింటారు కొంతమంది. అందుకే తక్కువ టైంలో ఎక్కువ బరువు పెరుగుతుంటారు. వాళ్లకు తెలియకుండానే షుగర్, కార్బొహైడ్రేట్స్, ఫ్యాట్ ఉండే ఫుడ్ ఎక్కువగా తినేస్తుంటారు. ఆలోచిస్తున్నా.. ఏడుస్తున్నా, కోపంగా ఉన్నా తింటూనే ఉంటారు. దీనివల్ల ఒకేసారి బరువు పెరిగిపోతారు. 

బింజే ఈటింగ్ డిజార్డర్

తినరు. తిన్నారంటే వాంతులు చేసుకోవాల్సిందే. ఇదే బింజే ఈటింగ్ డిజార్డర్. ఒకేసారి హెవీగా తినడం వల్ల వాంతులు, విరేచనాలు, తలనొప్పి, కాళ్లు, చేతులు లాగడం వంటి సింప్టమ్స్ ఉంటాయి.  ఒకరోజంతా ఉపవాసం ఉండి, మరొకరోజు హెవీగా తింటూ ఉంటారు. ఇది కూడా చాలా ప్రమాదమే.

కారణమేంటి?

మానసికంగా బలంగా లేనివాళ్లే ఈటింగ్ డిజార్డర్కు గురవుతుంటారు. లేనిపోనివి ఊహించుకోవడం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోవడం, ఇన్ సెక్యూరిటీ ఫీలింగ్తో సతమతమవుతుంటారు.  ముఖ్యంగా అందంగా ఉండాలని ఆరాటపడేవాళ్లలో ఇది ఎక్కువగా ఉంటుంది. అలాగే, వంశపారంపర్యంగా కూడా ఈ లక్షణాలు కనిపిస్తాయి. 

అందం ముఖ్యం కాదు

లావుగా ఉన్నా.. నల్లగా ఉన్నా అందరూ అందంగానే ఉంటారు. ఈ మధ్య  లావుగా ఉన్నవాళ్లు కూడా మోడలింగ్ రంగంలో రాణిస్తున్నారు. ఫిజిక్ ఉంటేనే అందంగా ఉంటామన్నది తప్పు.  నలుగురిలో గుర్తింపు పొందాలంటే కావాల్సింది అందం కాదు. నాలెడ్జ్. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా టీనేజ్ పిల్లలు, మహిళల్లో ఈ యాంగ్జైటీ ఎక్కువగా కనిపిస్తోంది. దీనివల్ల మానసికంగానూ, శారీరకంగానూ సమస్యలు ఎదుర్కొంటారు. ఇవే గుండె సంబంధిత వ్యాధులు, షుగర్, బీపీలతో పాటు మానసిక సమస్యలకూ దారి తీయొచ్చు. అందుకే, ఇన్ సెక్యూరిటీ ఫీలింగ్ తగ్గించుకోవాలి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుకోవాలి. అప్పటికీ  ఇవే ఆలోచనలతో ఉంటే ఎక్స్పర్ట్స్ని కలిసి కౌన్సెలింగ్ తీసుకోవాలి. డా. రాధిక, సైకాలజిస్ట్
డెక్కన్ హాస్పిటల్, హైదరాబాద్