బ్యారేజీలో ఒకటో రెండో పిల్లర్లు కుంగితే : హరీశ్ రావు

బ్యారేజీలో ఒకటో రెండో పిల్లర్లు కుంగితే : హరీశ్ రావు
  • కోడిగుడ్డు మీద ఈకలు పీకుతున్నరు
  • రంగనాయకసాగర్​, మల్లన్నసాగర్​, కూడవెల్లి వాగు, పొలాలు చూడండి 
  • కర్నాటక నుంచి కాంగ్రెస్​ ఎమ్మెల్యేలు వచ్చి అద్భుతం అని మెచ్చుకున్నరు
  • నాడు కాంగ్రెస్ ​అధికారంలో ఉండి ప్రాణహిత చేవెళ్ల ఎందుకు కట్టలేదని ప్రశ్న

హైదరాబాద్, వెలుగు: ఒక్క బ్యారేజీ లో 2 పిల్లర్లు కుంగితే మొత్తం ప్రాజెక్టే కుంగినట్టు, కాంగ్రెస్​ నాయకులు కోడిగుడ్డు మీద ఈకలు పీకుతున్నారని మాజీ మంత్రి హరీశ్​రావు కామెంట్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం కొట్టుకుపోయినట్టుగా మాట్లడటం విడ్డూరంగా ఉందన్నారు. మంగళవారం అసెంబ్లీ మీడియా పాయింట్​ వద్ద హరీశ్ మాట్లాడారు. 

‘‘కాళేశ్వరం సమగ్ర స్వరూపం చాలా మందికి తెలియదు. కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్ స్టేషన్లు, 21 పంప్ హౌస్​లు, 203 కిలోమీటర్ల సొరంగాలు, 1,531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్, 98 కిలోమీటర్ల ప్రెజర్ మెయిన్స్, 141 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ, 530 మీటర్ల ఎత్తుకు లిఫ్ట్, 240 టిఎంసీల ఉపయోగం... వీటన్నింటి సమాహారమే కాళేశ్వరం”అని హరీశ్ అన్నారు. 

కాళేశ్వరం ఫలితాల గురించి  రైతులను అడగండి. కర్నాటక నుండి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వచ్చి రంగనాయక సాగర్ చూశారు. అద్బుతం అని మెచ్చుకున్నారు. నేర్చుకున్నారని అన్నారు. కానీ కాంగ్రెస్​ నాయకులు మాత్రం ప్రాజెక్ట్​ను కూల్చేయాలన్న రీతిలో మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం నిర్మించడం వల్ల తెలంగాణ ఏ విధంగా అభివృద్ధి సాధించిందో  మీరు వెళ్ళే దారిలో రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కూడవెల్లి వాగు, పచ్చటి పొలాలు చూస్తే తెలుస్తుందన్నారు. 

మీ రాజకీయాలకు రైతులను ఇబ్బంది పెట్టొద్దు

చాప్రాల్ వైల్డ్ లైఫ్ ప్రాంతంలో ప్రాణహిత కట్టాలని చూస్తే అనేక అడ్డంకులు ఉన్నాయని హరీశ్ చెప్పారు. తాము నీళ్ళు లేని దగ్గర్నుంచి, నీళ్ళు ఉన్న దగ్గరకు మార్చి.. ప్రాజెక్టు కట్టి నీళ్ళు అందించామన్నారు. తెలంగాణలో 3 కోట్ల టన్నుల పంట పండిందంటే ఆ జలాల వల్లేనని అన్నారు. తప్పు జరిగితే చర్య తీసుకోవాలని, పునరుద్దరణ పనులు చేయాలని ఆయన సూచించారు. ‘‘మీ రాజకీయాల కోసం రైతులను ఇబ్బంది పెట్టకండి. వాళ్లు నష్ట పోతారు. ప్రజలు క్షమించరు”అని హరీశ్ అన్నారు. కాంగ్రెస్ హయాంలో పంజాగుట్ట ఫ్లై ఓవర్ కూలి 20 మంది చనిపోయారన్న విషయాన్ని మర్చిపోయారా? అంటూ హరీశ్ గుర్తు చేశారు. 

దేవాదుల పైపులు పేలి నీళ్లు ఆకాశమంత ఎగిరాయని, అలాంటి ఘటనలు జరగటం బాధాకరమని అన్నారు. కేంద్రంలో మహారాష్ట్ర, ఏపీలో కాంగ్రెస్ అధికారంలో ఉంటే.. ప్రాణహిత చేవెళ్ల ఎందుకు కట్టలేదు అని హరీశ్​రావు ప్రశ్నించారు. కాంగ్రెస్​ ప్రభుత్వ తీరు ప్రజాస్వామ్య విలువలను మంటగలిపేలా ఉందని హరీశ్​ పేర్కొన్నారు. శాసనసభ జరుగుతున్న తీరును ఆయన ఖండించారు. మీరు మాత్రమే మాట్లాడి, మాకు మైకులివ్వకపోవడం సభా సంప్రదాయాలకు విరుద్ధమన్నారు.