
- 25లోపు అఫిడవిట్లు ఇవ్వాలని కాళేశ్వరం ఇంజినీర్లకు చెప్పాం
- వివిధ విభాగాలకు చెందిన 20 మందిని ప్రశ్నించాం
- కాళేశ్వరం నిర్మాణ సంస్థలనూ ఎంక్వైరీకి పిలుస్తాం
- తప్పుడు లెక్కల వల్లే బ్యారేజీలకు నష్టం వాటిల్లింది
- అన్ని అంశాలపైనా లోతుగా విచారిస్తామని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై తప్పుడు అఫిడవిట్లు ఇస్తే చట్టపరమైన చర్యలు తప్పవని, క్రిమినల్ కేసులు పెడతామని జ్యుడీషియల్ కమిషన్ చైర్మన్ జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ హెచ్చరించారు. విచారణకు హాజరైన ఇంజినీర్లందరి నుంచి అఫిడవిట్లను అడిగామని తెలిపారు. ఈ నెల 25లోపు వాళ్లకు తెలిసిన సమాచారాన్ని అఫిడవిట్ల రూపంలో చెప్పాల్సిందిగా ఆదేశించినట్టు చెప్పారు.
మంగళవారం జస్టిస్ ఘోష్ బీఆర్కే భవన్‌లోని కాళేశ్వరం జ్యుడీషియల్ కమిషన్ ఆఫీసులో మీడియాతో చిట్‌చాట్ చేశారు. రెండ్రోజుల పాటు ఇంజినీర్లు, మాజీ అధికారులతో సమావేశమై విచారణ జరిపామని తెలిపారు. మంగళవారం ఇరిగేషన్ డిపార్ట్మెంట్లోని విభాగాలకు చెందిన 20 మందికిపైగా సీనియర్ ఇంజినీర్లు, అధికారులను ఎంక్వైరీ చేశామన్నారు.
3 బ్యారేజీల టెక్నికల్ అంశాలన్నింటినీ తెలుసుకున్నామని పేర్కొన్నారు. బ్యారేజీలు కుంగిన ఘటనల్లో ఏయే అంశాలున్నాయో తెలుసుకున్నామన్నారు. బుధవారం నుంచి చేయాల్సిన పనుల లిస్టు రెడీ చేస్తున్నామన్నారు.
లోతుగా విచారణ
అన్ని విషయాలపైనా లోతుగా విచారణ చేస్తామని జస్టిస్ ఘోష్ తెలిపారు. త్వరలోనే నిర్మాణ సంస్థల ప్రతినిధులనూ ఎంక్వైరీకి పిలుస్తామని అన్నారు. ప్రతి ఒక్కరూ రూల్స్‌కు అనుగుణంగానే నడుచుకోవాలని స్పష్టం చేశారు. ప్రజల ఫిర్యాదుల్లో అధికారుల పేర్లు ఉంటే వాళ్లకూ నోటీసులిస్తామని తేల్చి చెప్పారు. బ్యారేజీల్లో ఎక్కడో ఏదో తప్పు జరిగి ఉంటుందని, తప్పుడు లెక్కల వల్లే బ్యారేజీలకు నష్టం వాటిల్లినట్టు కనిపిస్తున్నదని చెప్పారు. బ్యారేజీలకు రిపేర్లు చేస్తే ప్రజలకు లాభం కలుగుతుందని ఘోష్ తెలిపారు.