ప్రజలపై ప్రేమ ఉంటే..  పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలి

ప్రజలపై ప్రేమ ఉంటే..  పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలి

    బీజేపీలో వారసత్వ పాలన లేదా: సబితా ఇంద్రారెడ్డి

ఎల్బీ నగర్, వెలుగు : దేశ ప్రజలపై ప్రధాని మోడీకి ప్రేమ ఉంటే వెంటనే పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గించాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి డిమాండ్ చేశారు. పేద, మధ్యతరగతి ప్రజలపై పడుతున్న నిత్యావసర సరుకుల భారాన్ని తగ్గించాలన్నారు. ఆదివారం రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలోని లక్ష్మి గార్డెన్​లో నిర్వహించిన బీఆర్ఎస్ లీడర్ల, కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో ఆమె పాల్గొని మాట్లాడారు. 

మోడీ దేవుడు అయితే తెలంగాణ ఇస్తున్నట్లు కళ్యాణలక్ష్మి, ఆసరా పెన్షన్లు, రైతు బీమా, రైతుబంధు, దళిత బంధు దేశమంతా ఇవ్వాలన్నారు. కొత్తగా కడుతున్న పార్లమెంట్ బిల్డింగ్​కు డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. పేద, మధ్య తరగతి ప్రజలను అప్పుల పాలు చేయొద్దని సూచించారు. రాష్ట్రానికొచ్చిన ప్రతిసారి కేసీఆర్ కుటుంబంపైనే మోడీ విమర్శలు చేస్తారని ఫైర్ అయ్యారు. కేటీఆర్, కవిత, హరీశ్​రావులు తెలంగాణ ఉద్యమం చేసింది కనిపించలేదా అని ప్రశ్నించారు. వాళ్లంతా నామినేటెడ్ పదవుల్లో లేరని, ప్రజలతో ఎన్నుకోబడిన పదవుల్లో ఉన్నారని తెలిపారు. 

విభజన హామీలు అమలు చేయాలి

బీజేపీలో వారసత్వ పాలన లేదా అని సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నించారు. విభజన హామీలు మరిచిపోయారని, కాళేశ్వరం, పాలమూరుకు జాతీయ హోదా ఎప్పుడు ఇస్తారని నిలదీశారు. కేంద్రం చిల్లిగవ్వ ఇవ్వకున్నా ప్రపంచంలోనే అతిపెద్దదైన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించామన్నారు. మోటార్లకు మీటర్లు పెట్టే విషయంలో కేసీఆర్​పై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు.

తెలంగాణలోని ఎన్నో స్కీమ్​లు ఇతర రాష్ట్రాల్లోనూ అమలవుతున్నాయని తెలిపారు. తుక్కుగూడలో మంచినీటి సమస్య శాశ్వత పరిష్కారానికి రూ.30కోట్ల నిధులు విడుదల చేశారన్నారు. వృథాగా సముద్రంలో పోతున్నమ నీళ్లను ఒడిసిపట్టి రాష్ట్రానికి అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్​ది అని అన్నారు.