పార్కింగ్​ జాగా లేకుంటే.. కార్లు ఎందుకు!

పార్కింగ్​ జాగా లేకుంటే.. కార్లు ఎందుకు!
  • జనం అట్ల కొంటుంటే మీరేంచేస్తున్రు?
  • మహారాష్ట్ర సర్కారుకు బాంబే హైకోర్టు ప్రశ్న 
  • పార్కింగ్ పై ఒక పాలసీ రూపొందించాలని సూచన 

ముంబై: ‘‘ఇండ్లు, అపార్ట్ మెంట్ల కాడ చూస్తే పార్కింగ్ ప్లేసే సక్కగ ఉండదు. చాలా చోట్ల కార్లను రోడ్ల మీదనే రెండు పక్కలా పార్క్ చేస్తున్నరు. పార్కింగ్ ప్లేస్ లేకపోయినా ఒక్కో ఫ్యామిలీకి నాలుగైదు కార్లు ఉంటున్నయి. పైసలున్నంత మాత్రాన ఇన్ని కార్లు కొనేందుకు ఎందుకు అనుమతిస్తున్నరు? కచ్చితంగా వాళ్లకు సరైనంత పార్కింగ్ ప్లేస్ ఉందో లేదో ముందే క్రాస్ చెక్ చేసుకోవాలి” అని మహారాష్ట్ర అధికారులను బాంబే హైకోర్టు ఆదేశించింది. పార్కింగ్ ప్లేస్ సరైనంత లేని అపార్ట్ మెంట్ లోని ఒక ఫ్లాట్ లో ఉంటున్న కుటుంబం నాలుగైదు కార్లు కొనేందుకు అనుమతించరాదని స్పష్టం చేసింది. ఇందుకోసం మహారాష్ట్ర అంతటా వర్తించేలా కొత్త పార్కింగ్ పాలసీని తేవాలని ప్రభుత్వానికి సూచించింది. రా ష్ట్రంలో అపార్ట్ మెంట్ కాలనీల్లో పార్కింగ్ ప్లేస్ ను తగ్గించేందుకు డెవలపర్స్ కు అనుమతి ఇస్తూ ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ నవీ ముంబైకి చెందిన సందీప్ ఠాకూర్ అనే యాక్టివిస్ట్ దాఖలు చేసిన పిల్ ను కోర్టు గురువారం విచారించింది. పార్కింగ్ ప్లేస్ లేకపోవడం వల్ల చాలా చోట్ల కార్లను రోడ్లపై ఉంచుతున్నారన్న పిటిషనర్ వాదనను కోర్టు అంగీకరించింది. ఇది ఎంతో మంది జనాల సమస్య అని చెప్పింది. ప్రతీచోట రోడ్లకు ఇరువైపులా దాదాపు 30 శాతం స్థలంలో వెహికల్స్ పార్క్ చేస్తున్నారని తెలిపింది. కొత్త వాహనాల కొనుగోళ్లు తగ్గాల్సిన అవసరం ఉందని, పార్కింగ్ ప్లేస్ లేకుంటే ఎక్కువ వెహికల్స్ కొనేందుకు అనుమతించరాదని తేల్చిచెప్పింది. ఈ పిల్ పై రెండు వారాల్లోగా ప్రభుత్వం సమాధానం తెలియజేయాలని ఆదేశించింది.