సిద్ధిపేట లేకపోతే కేసీఆర్‌ లేడు.. కేసీఆర్‌ లేకపోతే తెలంగాణ లేదు

సిద్ధిపేట లేకపోతే కేసీఆర్‌ లేడు.. కేసీఆర్‌ లేకపోతే తెలంగాణ లేదు

సిద్ధిపేట జిల్లాను మంత్రి హరీశ్ రావు అన్ని రకాలుగా అభివృద్ధి చేసి తన పేరును నిలబెట్టాడని అన్నారు సీఎం కేసీఆర్. గురువారం సిద్ధిపేటలో పర్యటించిన కేసీఆర్  పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఇందులో భాగంగా… సిద్ధిపేట గవర్నమెంట్‌ కాలేజీలో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. సిద్ధిపేటను మంత్రి హరీశ్‌ అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారని ప్రశంసించారు. సిద్ధిపేట పేరులో ఏదో బలం ఉందన్నారు. సిద్ధిపేట లేకపోతే కేసీఆర్‌ లేడు.. కేసీఆర్‌ లేకపోతే తెలంగాణ లేదు అని అన్నారు. అప్పట్లో కరెంట్ కష్టాలు ఉండేవని..తెలంగాణ ఏర్పడిన తర్వాత కరెంట్, నీటి సమస్య రాష్ట్రానికి…సిద్ధిపేటకు తీరిపోయిందన్నారు. సిద్ధిపేట మంచినీటి వసతి నుంచి వచ్చిన స్కీం.. మిషన్ భగీరథ అని అన్నారు. రాష్ట్రంలో మంచి టూరిస్టు స్పాట్ రంగనాయక్ సాగర్ అని..దాని అభివృద్ధికి రూ.100 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. అలాగే ఇర్కోడు లిఫ్ట్‌ ఇరిగేషన్‌కు రూ.85 కోట్లు మంజూరు చేశారు.  సిద్ధిపేట నుంచి ఇల్లెంతకుంట వరకు నాలుగు లైన్ల రోడ్డు నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు సీఎం కేసీఆర్.

ఇండియాకే రోల్ మోడల్ సిద్ధిపేట అన్న కేసీఆర్.. 22 గ్రామాలను కలుపుతూ 160 కోట్లతో రింగ్ రోడ్డు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. కొత్తగా మరో 1000 డబుల్ బెడ్ రూం ల ఇళ్లతో పాటు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. టౌన్ హాల్ నిర్మాణానికి  రూ.50 కోట్లు,ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కు రూ.25 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. అంతేకాదు సిద్ధిపేట లో నెలరోజుల్లో బస్తీ దవాఖానాను ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు సీఎం కేసీఆర్.