20మందికి చెక్కులిచ్చేందుకు ఇంత హడావుడా..?

20మందికి చెక్కులిచ్చేందుకు ఇంత హడావుడా..?
  • 10 లక్షల కోసం టీఆర్ఎస్ బ్రోకర్లు 2 లక్షలు కమీషన్ అడుగుతున్నారు
  • నిజంగా ప్రేమ ఉంటే దళితులందరికీ ఒకేసారి దళిత బంధు ఇవ్వాలి
  • బీజేపీ కోర్ కమిటీ సభ్యులు వివేక్ వెంకటస్వామి

హుజూరాబాద్: ‘‘కేవలం 20 మంది దళితులకు చెక్కులిచ్చేందుకు ఇంత దూరం రావాలా..? ఇంత మంది జనాలను కూడగట్టడం.. ఇంత హడావుడి చేయడం అవసరమా..? దళిత బంధు కింద 10 లక్షల సహాయం కావాలంటే 2 లక్షలు,3 లక్షలు లంచం ఇవ్వాలని కొందరు టీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. నిజంగా దళితులపై ప్రేమ ఉంటే అందరికీ ఒకేసారి రైతు బంధు చెక్కులివ్వాలి...’’ అని బీజేపీ కోర్ కమిటీ సభ్యుడు వివేక్ వెంకటస్వామి డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డితో కలసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.
సొంత నియోజకవర్గంలో చేయనివాళ్లు.. హుజూరాబాద్ లో ఏం చేస్తారు? 
సొంత నియోజకవర్గాల్లో ఏమీ చేయని మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే బాల్క సుమన్ హుజూరాబాద్ లో ఏం చేస్తారని వివేక్ వెంకటస్వామి ప్రశ్నించారు. టీఆర్ఎస్ నాయకులు కమీషన్లు దోచుకోవడానికే దళితబంధు పెట్టారని ఆయన ఆరోపించారు. హైదరాబాద్ లో వర్షాలు వచ్చి నష్టపోయిన వారికి 10వేలు కావాలంటే 5వేలు లంచం ఇవ్వాలని టీఆర్ఎస్ నాయకులు వసూలుచేసిన ఉదంతాలు అందరూ చూశారని ఆయన పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ రెండేళ్ల క్రితమే సర్వే చేయించి అన్ని వివరాలు ఉన్నాయి.. ఆ వివరాల ప్రకారం.. దళితుల అకౌంట్లలోకి నేరుగా వేసేయాలి. కానీ అక్రమాల కోసమే.. మళ్లీ ఎంపిక.. చెక్కులిస్తామని హడావుడి చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
కాళేశ్వరం ప్రాజెక్టు లో 55వేల కోట్ల అవినీతి జరిగింది
కాళేశ్వరం ప్రాజెక్టులో 55వేల కోట్ల అవినీతి జరిగిందని బీజేపీ కోర్ కమిటీ సభ్యుడు వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. ఈ అవినీతి జరగకపోయి ఉంటే.. ప్రాణహిత చేవెళ్ల 33వేల కోట్లతోనే పూర్తయ్యేదని ఆయన వివరించారు. చింతమడుగులో ఇంటింటికీ 10 లక్షలు ఎలా ఇచ్చావో.. ఇక్కడ కూడా దళితులందరికీ ఇంటింటికీ 10 లక్షలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఇంతకు ముందే నువ్వు తెలంగాణ భవన్ లో అంగీకరించావు కదా.. ప్రభుత్వ పైసలే తీసుకుని పంచుతున్నామని చెప్పావు కదా అని గుర్తు చేశారు. దళితుల్లో చాలా మంది కౌలు చేసుకుని జీవిస్తున్నారని, వారికి కనీసం రైతు బంధు కూడా రాలేదన్నారు.
3 ఎకరాల భూమి ఇస్తానని కేసీఆర్ ఇప్పుడైనా ప్రకటించాలి
సీఎం కేసీఆర్ దళితులందరికీ మూడు ఎకరాల భూమి ఇస్తానని చెప్పి మాట తప్పావు కదా.. కనీసం హుజూరాబాద్ కు వస్తున్న సందర్బంగా ఇక్కడైనా ప్రకటించాలని బీజేపీ కోర్ కమిటీ సభ్యుడు వివేక్ వెంకటస్వామి డిమాండ్ చేశారు. కొప్పుల ఈశ్వర్, బాల్క సుమన్ హుజూరాబాద్ లో చేస్తున్న వాగ్దానాలేవో.. ముందు మా నియోజకవర్గాల్లో అమలు  చేయాలని వారి నియోజకవర్గాల ప్రజలు కోరుతున్నారని ఆయన తెలిపారు. హుజూరాబాద్ కు వచ్చి ప్రచారం చేస్తున్న టీఆర్ఎస్ నాయకులు తమ సొంత నియోజకవర్గాల్లో ఎలాంటి అభివృద్ధి చేయకుండా మభ్యపెట్టి ఇక్కడకొచ్చి మళ్లీ మోసం చేయాలని చూస్తున్నారని విమర్శించారు. టీఆర్ఎస్ నాయకులు వారి నియోజకవర్గాల్లో ఎక్కడైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేదు, 100 పడకల ఆస్పత్రులు నిర్మించలేదు.. హుజూరాబాద్ కు వచ్చి ఏవేవో ఇస్తామని చెబుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. హుజూరాబాద్ నియోజకవర్గం ప్రజలు తమ వద్దకు వచ్చి హామీలు ఇస్తున్న నాయకులను వారి సొంత నియోజకవర్గాల్లో ముందు చేశారా అని నిలదీయాలని వివేక్ వెంకటస్వామి కోరారు. ఎన్నికల ముందు ఇచ్చే హామీలను ఎన్నికల తర్వాత మరచిపోవడం కేసీఆర్ కు  అలవాటు అని.. రేపు మళ్లీ ఓట్ల కోసమే హుజూరాబాద్ వస్తునారని ఆయన విమర్శించారు.