దేశంలో అధికారంలోకొస్తే కిసాన్ బంధు ఇస్తం : కేసీఆర్

దేశంలో అధికారంలోకొస్తే కిసాన్ బంధు ఇస్తం : కేసీఆర్

దేశంలో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే కిసాన్ బంధు అమలుచేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. రైతులకు తాగు, సాగు నీరు ఇవ్వలేని స్థితలో దేశం ఉండడం దురదృష్టకరమన్నారు. ఒడిశా మాజీ సీఎం గిరిధర్ గమాంగ్ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. తెలంగాణ భవన్లో ఆయనకు సీఎం కేసీఆర్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. గిరిధ‌ర్‌తో పాటు 12 మంది మాజీ ఎమ్మెల్యేలు, న‌లుగురు మాజీ ఎంపీలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు.  దేశ రాజధానిలో రైతులు ఆందోళన చేసే పరిస్థితులు ఎందుకొచ్చిందని కేసీఆర్ నిలదీశారు. ప్రతి దళితుడుకి కేంద్రం 10లక్షలు ఎందుకియ్యదు అని ప్రశ్నించారు. 

దేశ లక్ష్యం ఏమిటని ఖమ్మం సభలో ప్రశ్నించానని కేసీఆర్ అన్నారు. మహారాష్ట్రలో రైతుల ఆత్మహత్యలు ఎక్కవగా ఉన్నాయన్న ఆయన.. తెలంగాణలో ఆ పరిస్థితి లేదన్నారు. అమెరికా, చైనా కంటే మన దగ్గరే ఎక్కువ వనరులున్నాయని.. అయినా దేశం వాటికంటే వెనుకబడే ఉందన్నారు. 75 ఏళ్లలో మనం ఏం సాధించామో అందరూ ఆలోచించాలన్నారు. ప్రభుత్వ ఆస్తులను సంతలో అమ్మేసినట్లు అమ్మేస్తున్నారని విమర్శించారు. రైతులు చట్టసభల్లోకి రావాలని ఆకాంక్షించారు. నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగాయన్న కేసీఆర్.. ఈ ప్రభుత్వం ఎవరికోసం పనిచేస్తోందని నిలదీశారు. ప్రజలను దోచి.. పెద్దలకు పెడుతున్నారని మండిపడ్డారు. కేంద్ర వైఫల్యాలపై బీఆర్ఎస్ పోరాడుతుందని ఆయన స్పష్టం చేశారు.