మీరు, మీ అన్న ఇద్దరూ ఏపీలో కష్టపడితే ఫలితం ఉంటది : వినోద్ కుమార్

 మీరు, మీ అన్న ఇద్దరూ ఏపీలో కష్టపడితే ఫలితం ఉంటది : వినోద్ కుమార్

దీక్షా దివాస్ సందర్భంగా వరంగల్ లో జీడబ్ల్యూఎంసీ ఆవరణలో దీక్ష దివాస్ స్ఫూర్తి చిహ్నానికి ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్, ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్, నగర మేయర్ గుండు సుధారాణి, ప్రజా ప్రతినిధులు నివాళులర్పించారు. వైఎస్ షర్మిల పాదయాత్ర పేరిట తెలంగాణలో గొడవలు సృష్టించే కార్యక్రమం చేస్తోందని ఈ సందర్భంగా ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ విమర్శించారు. ఉద్యమకారుడు పెద్ది సుదర్శన్ రెడ్డిపై షర్మిల నీచ పదజాలం వాడిందని ఆరోపించారు. తెలంగాణా ఉద్యమంలో  కనిపించని బీజేపీ నాయకుడు రాజకీయం కోసం పాదయాత్ర పేరుతో రెచ్చగొడుతున్నాడని కామెంట్ చేశారు.

 

మీరు ఇక్కడ పార్టీ పెట్టుకోవడం రాంగ్ ఛాయిస్ 

తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటిస్తామని చెప్పినప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి అడ్డుపడ్డాడని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ ఆరోపించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి బిడ్డ షర్మిల తెలంగాణాలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టడం విడ్డూరమన్నారు. అమిత్ షాతో మాట్లాడిన తర్వాత తెలంగాణలో ఈ యాత్ర మొదలు పెట్టిందన్న ఆయన... తాము గమనిస్తూనే ఉన్నామని చెప్పారు. షర్మిళ పాదయాత్ర ఆంధ్రాలో చేస్తే ఫలితం వచ్చేదిని వ్యాఖ్యానించారు. మీరు ఇక్కడ పార్టీ పెట్టుకోవడం రాంగ్ ఛాయిస్ అన్న వినోద్ కుమార్...  బెటర్ ఛాయిస్ ఏంటంటే... మీరు మీ అన్నా ఇద్దరు ఆంధ్రప్రదేశ్ లో కష్టపడితే ఫలితం ఉంటదని అభిప్రాయం వ్యక్తం చేశారు. షర్మిళ అక్కా అని మర్యాదగా సంభోదిస్తున్నానన్న ఆయన... రాజకీయాల్లో మీరు విమర్శలు చెయ్యండి కానీ మర్యాద తప్పి మాట్లాడడం తప్పని చెప్పారు. మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి గతంలో తెలంగాణ వస్తే కరెంటు ఉండదని చెప్పారని, ఇప్పుడు ఏం పరిస్థితి ఉందో చూడండని చెప్పారు. షర్మిళ వెనుక బీజేపీ పార్టీ హస్తం ఉందని ప్రజలందరూ గమనిస్తున్నారన్న ఆయన... బండి సంజయ్  పార్లమెంట్ లో నవోదయ విద్యాలయాల గురించి ఎప్పుడైనా మాట్లాడారా... నువ్వు తెలంగాణ బిడ్డవు కాదా అని నిలదీశారు.