నాయకులు బెదిరిస్తే జైలుకు పంపుతం : మంత్రి తలసాని

నాయకులు బెదిరిస్తే జైలుకు పంపుతం : మంత్రి తలసాని

బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరించండని మంత్రి తలసాని ఆదేశించారు. వారు ఇచ్చే ఫిర్యాదులను ప్రోత్సహించకండని చెప్పారు. గోషామహల్ నియోజకవర్గ పరిధిలోని చక్నవాడి నాలాపై ఇటీవల కూలిన వంతెనను మంత్రి తలసాని, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ పరిశీలించారు. ఈ సమయంలో టౌన్ ప్లానింగ్ అధికారులపై సీరియస్ అయిన మంత్రి తలసాని... హైదరాబాద్ నగరంలో భవన నిర్మాణదారులపై ఫిర్యాదులు చేస్తూ... అక్రమ వసూళ్లకు పాల్పడే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయిస్తామని హెచ్చరించారు. తమ పార్టీకి చెందిన నాయకులైనా, ఇంకెవరైనా.. ఇలాంటి బెదిరింపులకు పాల్పడితే వారిని జైళ్లో వేయిస్తామని చెప్పారు. అధికారులు ఇలాంటి వారితో సన్నిహిత్యంగా మెలిగితే మీపై కూడా చర్యలు తీసుకుంటామన్నారు. చాక్నవాడి నాలా పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయని ఈ సందర్భంగా తలసాని స్పష్టం చేశారు. రూ. 1 కోటి 27 లక్షల నిధులు కేటాయించామన్నారు. 

ఈ ప్రాంతంలో హేవీలోడెడ్ వెహికిల్స్ తిరగడం వల్ల నాలా రోడ్డు కుంగిపోయిందని మంత్రి తలసాని చెప్పారు. ఈ రోడ్డులో హేవి వెహికిల్స్ తిరగకుండా కమాన్ ను ఏర్పాటు చేస్తామన్న మంత్రి.. నాలాను ఆక్రమించుకొని చేపట్టిన నిర్మాణాలను గుర్తిస్తున్నామని తెలిపారు. వారికి నోటీసులు ఇచ్చి నిర్మాణాలను తొలగిస్తామని స్పష్టం చేశారు. వ్యాపారం కంటే ప్రజల ప్రాణాలు ముఖ్యమని చెప్పారు. భవన నిర్మాణదారులను బ్లాక్ మెయిల్ చేసే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించమని హెచ్చరించారు.