స్టూడెంట్లకు హాస్టల్ ఇవ్వకుంటె గద్దెదిగండి : ఆర్ఎస్ ​ప్రవీణ్​కుమార్

స్టూడెంట్లకు హాస్టల్ ఇవ్వకుంటె గద్దెదిగండి : ఆర్ఎస్ ​ప్రవీణ్​కుమార్

నిజాం కాలేజీ స్టూడెంట్లకు మద్దతు

సికింద్రాబాద్, వెలుగు: నిజాం కాలేజీ డిగ్రీ స్టూడెంట్లకు హాస్టల్ కేటాయించకపోతే రాష్ట్ర సర్కార్​ వెంటనే గద్దె దిగిపోవాలని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. కొత్తగా నిర్మించిన హాస్టల్​ను తమకే కేటాయించాలని డిమాండ్ చేస్తూ 14 రోజులుగా ఆందోళన చేస్తున్న డిగ్రీ స్టూడెంట్లకు  సోమవారం ఆర్​ఎస్​ ప్రవీణ్ ​కుమార్, అరుణోదయ సాంస్కృతిక  మండలి చైర్ ​పర్సన్​ విమలక్క, ఎన్ఎస్​యూఐ రాష్ట అధ్యక్షుడు బల్మూరి ​వెంకట్, ఏబీవీపీ నాయకులు మద్దతు తెలిపారు.​  ఈ సందర్భంగా ప్రవీణ్ ​కుమార్ మాట్లాడుతూ.. 2017లో డిగ్రీ స్టూడెంట్ల కోసం నిర్మించిన హాస్టల్​ను పీజీ విద్యార్థులకు కేటాయించడాన్ని తప్పుబట్టారు. ఇప్పుడున్న కొత్త బిల్డింగుతో పాటు మరో నూతన బిల్డింగ్ కూడా నిర్మించాలని డిమాండ్ చేశారు. స్టూడెంట్ల డిమాండ్లు పరిష్కరించకుండా వారిపై క్రిమినల్ కేసులు పెడతామని బెదిరించడాన్ని ఖండించారు. కేసీఆర్​కు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా వచ్చే ఆదాయం, సొంత విమానం మీద ఉన్న శ్రద్ధ పిల్లల చదువులపై లేదన్నారు. తెలంగాణ రాష్ట్రం ఉస్మానియా, నిజాం కాలేజీ విద్యార్థుల వల్లనే సాధ్యమైందని గుర్తు చేశారు. కేటీఆర్ విదేశాలకు వెళ్లడానికి ఖర్చు చేసే డబ్బుతో హాస్టల్ నిర్మాణం చేయవచ్చని సూచించారు. 

ఇంత నిర్లక్ష్యమా: విమలక్క

హాస్టల్​ కోసం  స్టూడెంట్లు రోడ్డెక్కి ఆందోళనలు చేస్తుంటే అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని , స్టూడెంట్లు అంటే ఇంత నిర్లక్ష్యమా ? అని విమలక్క మండిపడ్డారు. ఉన్నత మార్కులు సాధించి నిజాం కాలేజీలో ప్రవేశించిన స్టూడెంట్లకు అధికారులు హాస్టల్​ వసతి కేటాయించకపోవడం దారుణమన్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థుల ఆశలను అడియాసలు చేయకుండా వెంటనే వారికి హాస్టల్​ కేటాయించాలని ఆమె డిమాండ్​ చేశారు. 

ఉద్యమం తప్పదు: బల్మూరి​ వెంకట్​

నిజాం​ కాలేజీ డిగ్రీ స్టూడెంట్ల కోసం నిర్మించిన భవనాన్ని వారికే కేటాయించి వెంటనే అడ్మిషన్లు కల్పించాలని ఎన్​ఎస్​యూ ఐ రాష్ర్ట అధ్యక్షుడు బల్మూరి​వెంకట్​డిమాండ్​ చేశారు. లేకుంటే స్టూడెంట్లతో కలిసి ఉద్యమిస్తామని హెచ్చరించారు. కమిషనర్ నవీన్ మిట్టల్ చర్చల పేరుతో స్టూడెంట్లను పిలిచి బెదిరించడం సరికాదన్నారు.  శాంతియుతంగా ధర్నా నిర్వహిస్తే పోలీసులు దాడి  చేసి ఈడ్చి పడేయడం దుర్మార్గమన్నారు.

చర్చల మధ్యలో నుంచి వెళ్లిపోయిన ప్రిన్సిపాల్​

హాస్టల్​ కేటాయింపు విషయమై  సోమవారం ఏబీవీపీ నాయకులు  నిజాం​కాలేజీ ప్రిన్సిపాల్​తో సమావేశమయ్యారు. ఓ వైపు స్టూడెంట్స్ చర్చిస్తుండగానే  హాస్టల్​ కేటాయింపు అంశం వైస్​ చాన్స్​లర్​ పరిధిలో ఉందని, తానేమీ చేయలేనంటూ ప్రిన్సిపాల్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ సందర్బంగా  ఏబీవీపీ నాయకులు ప్రవీణ్​ రెడ్డి, శ్రీహరి, సురేష్​  మాట్లాడుతూ  హాస్టల్​ వసతి కల్పించకుండా అధికారులు స్టూడెంట్లను మానసికంగా ఇబ్బందులకు గురిచేసే విధంగా వ్యవహరించడం దారుణమన్నారు.