ఆ సిటీకి వెళితే.. షాపులు, ఇళ్లలోనే కాదు ఎక్కడా ప్లాస్టిక్ కనిపించదు

ఆ సిటీకి వెళితే.. షాపులు, ఇళ్లలోనే కాదు ఎక్కడా ప్లాస్టిక్ కనిపించదు

ప్లాస్టిక్ మన జీవితంలో ఒక భాగం అయిపోయింది. ఇప్పుడు మనం వాడే 70% వస్తువుల్లో ముఖ్యమైన మెటీరియల్ ప్లాస్టిక్. కూరగాయలు తెచ్చుకునే కవర్ల దగ్గరనుంచీ ఫర్నిచర్ వరకూ ప్లాస్టిక్ లేందే పనికావట్లేదు. నిజానికి ప్లాస్టిక్ ని అవాయిడ్ చెయ్యటం కష్టమే.  కానీ ఎన్విరాన్‌‌మెంట్‌‌ని కాపాడుకోవాలంటే మాత్రం కచ్చితంగా ప్లాస్టిక్ వాడటం తగ్గించి తీరాల్సిందే.

కానీ ప్లాస్టిక్ లేకుండా ఎలా?

దానికి బదులుగా ఏ మెటీరియల్‌‌ని వాడాలనుకున్నా కాస్ట్, బరువు, క్వాలిటీ అన్నిటిలోనూ ప్లాస్టిక్‌‌తో ఏదీ సాటిరాదు. ఒకరకంగా మనం ప్లాస్టిక్ వాడక తప్పని పరిస్థితుల్లో ఇరుక్కుపోయాం. దీన్నుంచి బయటపడాలంటే ఎలా? దీనికి జపాన్‌‌లోని ఒక చిన్న టౌన్ ఆన్సర్ చెబుతోంది.

సౌత్ జపనీస్‌‌ ఐలాండ్ నుంచి 150 కిలోమీటర్ల దూరంలో  బెప్పూ సిటీ ఉంది. ఈ సిటీ జనాభా మొత్తం లక్షకు పైగానే ఉంటుంది. ఆ ఊళ్లో ఎక్కడా ప్లాస్టిక్ కనిపించదు. ఇంట్లో వాడే వస్తువుల దగ్గరనుంచి ఫర్నిచర్ దాకా మొత్తం వెదురుతోనే ఉంటాయి. ఆఖరికి కంప్యూటర్ కీ బోర్డ్స్ కూడా వెదురుతో తయారుచేసే పనిలో ఉన్నారట బెప్పూ సిటీ కళాకారులు. అలా వాళ్ల క్రియేటివిటీతో ఆ సిటీనే ఎకోఫ్రెండ్లీ సిటీగా మారిపోయింది. ఆ ఊళ్లో ప్లాస్టిక్ వాడకం అనేది పూర్తిగా నిషేధించారు.

ప్లాస్టిక్ వాడాల్సిన ప్లేస్‌‌లో వెదురుని వాడుతున్నారు. కూరగాయలు తెచ్చుకునే బుట్ట దగ్గరనుంచీ, లాంప్ షేడ్స్ వరకూ వెదురు వాడుతున్నారు. వెదురుతో కదా మరీ నాటుగా ఉంటాయేమో అనుకోవటానికి ఛాన్సే లేదు. ఒక్కొక్క వస్తువూ ఒక్కో రకంగా, ప్లాస్టిక్ కన్నా అందంగా కనిపించేలా తీర్చిదిద్దుతున్నారు. ఇక వెదురుతో తయారు చేసే ఆర్ట్ పీస్‌‌లు (కళాఖండాలు) మనం కళ్లు తిప్పుకోలేనంత అందంగా ఉంటాయి. జపాన్‌‌ వాళ్లకు మాత్రమే సాధ్యమయ్యే ఆర్ట్ అది. అక్కడ తయారైన ప్రొడక్ట్స్‌‌ వల్ల అక్కడ చాలామందికి జీవనోపాధి దొరుకుతోంది.

మార్కెట్‌‌లో  బెప్పూ బ్యాంబూ బ్రాండ్ అంటే ఒక క్రేజ్ ఇప్పుడు. దీనికి జపాన్ గవర్నమెంట్ కూడా సాయంగా వచ్చింది. ఎకో ఫ్రెండ్లీ వస్తువు ఏది తయారు చేసినా అక్కడి ప్రభుత్వం మద్దతుగా ఉంటోంది. మామూలుగా వెదురుతో చిన్న బుట్టలు, బొమ్మలు, ఉయ్యాలలు, కుర్చీలు, సోఫాల్లాంటివి మనదగ్గర కూడా కనిపిస్తాయి. కానీ, బెప్పూ సిటీ ఆర్టిస్టులు  హాల్లో ఉండే ఫర్నిచర్‌‌ నుంచి కిచెన్‌‌లో వాడే స్పూన్లవరకూ వెదురుతో తయారుచేస్తారు.  బెడ్‌‌ ల్యాంప్‌‌, రూఫ్‌‌, ఇండోర్‌‌, అవుట్‌‌డోర్‌‌ డెకరేషన్‌‌లు ఇలా ఇంటీరియర్, ఎక్స్‌‌టీరియర్ డెకరేషన్స్ వరకూ అన్నీ వెదురుతోనే తయారవుతాయి. కిటికీలు, కాంపౌండ్ వాల్స్ కూడా బ్యాంబూతోనే తయారు చేస్తున్నారు.  ఇప్పుడు జపాన్ గవర్నమెంట్ కూడా వీళ్లతో కలిసి పనిచేస్తోంది. బెప్పూ సిటిజెన్స్‌‌కి మాత్రమే కాకుండా జపాన్‌‌లో ఉండే అందరికీ ఈ ఆర్ట్‌‌ని పరిచయం చేస్తోంది.