చారిత్రక కోటలు చూడాలంటే పెద్దపల్లికి వెళ్లాల్సిందే

చారిత్రక కోటలు చూడాలంటే పెద్దపల్లికి వెళ్లాల్సిందే

పురాతన దేవాలయాలతో పాటు చారిత్రక కోటలు, బుద్ధుడి ఆనవాళ్లను చూడాలంటే పెద్దపల్లికి వెళ్లాల్సిందే. ప్రకృతి ఒడిలో సేదతీరాలి అనుకునేవాళ్లు, వాగులు వంకల్ని, చెట్టూచేమల్ని ఫొటోలు తీయాలనుకునేవాళ్లకు పెద్దపల్లి బెస్ట్ ఛాయిస్​. అంతేకాదు ఇక్కడికి వెళ్తే కొండల మీద నుంచి జాలువారే జలపాత అందాల్ని చూసి ఎంజాయ్​ చేయొచ్చు. బొగ్గుగనులు, గోదావరి తీరం ఉన్న ఈ ప్లేస్​ వీకెండ్ టూర్​కి బాగుంటుంది. థర్మల్​ పవర్​ప్లాంట్​ కేంద్రంగాను పేరొందిన ఈ జిల్లాకు వెళ్తే గుర్తుండిపోయే జ్ఞాపకాల్ని సొంతం చేసుకోవచ్చు.  

రామగిరి కోట 

ఈ కోటను రామగిరి కొండల మీద 12 మీటర్ల ఎత్తైన రాతి పునాది మీద కట్టారు. దీన్ని 12వ శతాబ్ధంలో కాకతీయ రాజులు కట్టించారు. ఈ కోట బురుజులు అష్టభుజి ఆకారంలో (ఎనిమిది మూలలతో) ఉంటాయి. కాకతీయుల కాలం నుంచి బహమనీ సుల్తాన్​లు, అసఫ్​జాహీల వరకు ఈ కోట కేంద్రంగా పరిపాలించారు. ఈ కోట దగ్గర్లో చాలా ఔషధ మొక్కలు ఉన్నాయి. అందుకని ఈ ప్రాంతాన్ని ‘మెడిసినల్​ ప్లాంట్స్​ కన్జర్వేషన్​ సెంటర్​’గా ప్రకటించాలనే డిమాండ్ ఉంది. కమాన్​పూర్​ మండలంలోని బేగంపేట గ్రామం నుంచి 6 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ కోట.

బౌద్ధ స్తూపం

తెలంగాణలో  బౌద్ధమతానికి సంబంధించిన ఆనవాళ్లు  ధూళికట్టలో ఉన్నాయి.  ఎలిగేడు మండలంలోని ధూళికట్ట గ్రామంలో పురాతన బౌద్ధ స్తూపం ఉంది. బౌద్ధ మతంలోని హీనయాన వర్గానికి చెందిన స్తూపం ఇది.  క్రీస్తు పూర్వం రెండో శతాబ్ధంలో దీన్ని కట్టించారని చరిత్ర చెప్తోంది. ఈ స్తూపం కట్టేందుకు తేలికగా ఉండే ఇటుకల్ని వాడారు. ఇక్కడ బుద్ధుడు ఉపయోగించిన గొడుగు, పాదుకలు, స్వస్తిక్ ముద్ర వంటివి కనిపిస్తాయి. ఈ స్తూపం కింది భాగంలో ప్రదక్షిణలు చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. సున్నపు రాయి స్లాబ్స్​ మీద ముచలింద నాగ (బౌద్ధ పురాణ కథల్లోని ఒక పాము) బొమ్మ కనిపిస్తుంది. పెద్దపల్లి నుంచి 13 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ స్తూపం.  

సబితం వాటర్​ఫాల్

పెద్దపల్లికి 15 కిలోమీటర్ల దూరంలో ఉంది సబితం వాటర్​ఫాల్. దీన్ని ‘గౌరీ గుండాల జలపాతం’ అని పిలుస్తారు అక్కడివాళ్లు. గట్టుసింగారం కొండల మీద నుంచి నీళ్లు జలపాతంలా కిందకు దుంకుతాయి. జూలై నుంచి నవంబర్​ మధ్యలో ఇక్కడికి వెళ్తే  జలపాతం అందాల్ని చూడొచ్చు. వీటితోపాటు రామగుండం థర్మల్ పవర్​ ప్లాంట్, గోదావరి ఖని బొగ్గు గనులు కూడా చూడొచ్చు.  

ఆండాళమ్మ గుడి

ధర్మాబాద్​లో ఉన్న  ఈ గుడి తెలంగాణలోని పురాతనమైన దేవాలయాల్లో ఒకటి. దీన్ని మూడొందల ఏండ్ల క్రితం ఎర్రబట్టి నర్సింగరావు అనే భూస్వామి కట్టించాడని చెప్తారు. అప్పటికే ఊర్లో రంగనాథస్వామి గుడి ఉండడంతో ఆండాళమ్మ కోసం ఈ ఆలయాన్ని కట్టించారట. పడమర దిక్కు ముఖం ఉండడం  గుడి ప్రత్యేకత. అంతేకాదు ఈ గుడిలో అమ్మవారి విగ్రహం ఉండదు. ఇలా ఎందుకంటే... విగ్రహ ప్రతిష్ఠాపన సమయానికి భూస్వామి చనిపోవడం వల్లనే అంటారు ఆ ఊరివాళ్లు. ప్రధాన గోపురంతో కలిపి మూడు గోపురాలు ఉంటాయి.  వాటి మీద వరుసలుగా చెక్కిన శిల్పాలు ఆకట్టుకుంటాయి.లొకేషన్​ బాగుండడంతో ప్రి–వెడ్డింగ్ ఫోటోషూట్​, ఫోక్​ సాంగ్స్​, షార్ట్​ ఫిల్మ్స్​ తీస్తుంటారు ఇక్కడ. పెద్దపల్లి నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ గుడి.