పిల్లలు గొడవపడకుండా ఉండాలంటే ఇలా చేయండి

పిల్లలు గొడవపడకుండా ఉండాలంటే ఇలా చేయండి

ఇంట్లోకి చిట్టి చెల్లెలు, తమ్ముడు వచ్చినప్పుడు పిల్లల ఆనందానికి హద్దే ఉండదు. వాళ్లని ఆడిస్తూ.. పాడిస్తూ తెగ ముద్దు చేస్తుంటారు. కానీ, పెరిగిపెద్దయ్యే కొద్దీ  ‘చెల్లి నా చాక్లెట్​ తినేసింది... ’ ‘తమ్ముడు నా  బొమ్మ విరగ్గొట్టాడు’ అంటూ కంప్లైంట్​ బాక్స్​ తెరుచుకుంటుంది. అవి రానురాను కొట్లాటలకి దారితీస్తాయి. వీటిని చూసీచూడనట్టు వదిలేస్తే ఆ ఎఫెక్ట్​ వాళ్ల రిలేషన్​పై పడుతుంది. మరి ఇలాంటి సిచ్యుయేషన్స్​లో  పేరెంట్స్​ ఏం చేయాలంటే.. 

తోబుట్టువులన్నాక చిన్నాచితకా గొడవలు, కొట్లాటలు సహజమే. కానీ, అవి మితిమీరితే మాత్రం పెద్ద సమస్యే. వాటిని పట్టించు కోకుండా వదిలేస్తే మరింత పెరిగి పెద్దవవుతాయి. అలా కాకుండా వాళ్లు కలిసిమెలిసి ఉండాలంటే పేరెంట్స్​ ఒక  రూల్ బుక్​ని ఫాలో అవ్వాలి.

పోలిక వద్దు
తోబుట్టువులైనంత మాత్రాన పిల్లల ఆలోచనలు, ప్రవర్తన ఒకేలా ఉండాలని లేదు. ఇద్దరికీ వేరువేరు అభిప్రాయాలు, అభిరుచులు ఉంటాయి. ఈ విషయాల్ని పేరెంట్స్​ అర్థం చేసుకోవాలి. ‘అన్నని చూసి నేర్చుకో.. తమ్ముడిలా బుద్ధిగా ఉండు’ లాంటి మాటలు వాళ్లకి చెప్పకూడదు. ఒకరి ఇష్టాల్ని మరొకరిపై రుద్దకూడదు. ఇవే వాళ్ల మధ్య గొడవలకి ఎక్కువగా కారణం అవుతాయి. అలాగే గొడవ జరిగినప్పుడు ఒకరి తరపునే  మాట్లాడ కూడదు. ఒకరినే వెనకేసుకురాకూడదు. తప్పు ఎవరిదైతే వాళ్లని మందలించాలి. వాళ్ల తప్పుని సరిదిద్దే ప్రయత్నం చేయాలి. అసలు సమస్య ఎక్కడ మొదలైందో అడిగి తెలుసుకోవాలి. 

ఎనలైజ్​ చేయాలి
కొంతమంది పిల్లలు తప్పుచేసినా ధైర్యంగా మాట్లా డుతుంటారు. పైగా అన్ననో,  తమ్ముడినో కొట్టి వాళ్లే ఎదురు ఏడుస్తుంటారు. అలాగని ఇలా దూకుడుగా ఉండే పిల్లలదే ఎప్పుడూ తప్పుంటుందని చెప్పలేం. అందుకే ఒకరి మాటలు నమ్మి మరొకర్ని తిట్టడం, కొట్టడం లాంటివి చేయకూడదు. గొడవకి కారణం ఎవరో తెలుసుకోవాలి. అందుకోసం పేరెంట్స్...​ ఇద్దరి వాదనలు వేరువేరుగా వినాలి. అప్పుడు తప్పు ఎవరిదో తెలుస్తుంది. అయితే తప్పు చేసిన వాళ్లని కొట్టడం వల్ల వాళ్ల మధ్య దూరం పెరుగుతుందే తప్ప తగ్గదు. అందుకే  అలా చేయడం తప్పన్న విషయం వాళ్లకి తెలిసేలా చేసి, సారీ చెప్పిస్తే సరిపోతుంది. 

చిన్ననాటి ఫొటోలు చూపించాలి
కొట్లాటల తర్వాత పిల్లల మధ్య అలకలు, పేచీలు మామూలే. అలాంటప్పుడు పేరెంట్స్​ చొరవ తీసుకొని వాళ్లతో ఆటలు ఆడించడం లాంటివి చేయాలి. వాళ్లని ఒక టీమ్​లాగా పెడితే ఇద్దరి మధ్య కమ్యూనికేషన్​ పెరిగి మాటలు కలుస్తాయి. 
అలాగే వాళ్లు కలిసి దిగిన ఫొటోలు చూపించాలి. వాళ్లు చిన్నప్పుడు ఒకరితో మరొకరు ఎంత ప్రేమగా ఉన్నారో చెప్పాలి. కలిసి హోం వర్క్​ చేసేలా చూడాలి. దీనివల్ల గొడవలు తగ్గుతాయి. అలాగే ఇంట్లో కంప్లయింట్స్​ బాక్స్​ ఒకటి పెట్టాలి. పిల్లల్ని వారానికోసారి వాళ్లకున్న సమస్యలేంటో రాసి, అందులో వేయమనాలి.  

సమానంగా చూడాలి
ఇంట్లో ఇద్దరు పిల్లలుంటే..ఒకరి మీద చూపించే  ప్రేమ మరొకరికి నచ్చకపోవచ్చు. ముఖ్యంగా అన్నలు, అక్కలు ఈ విషయాల్లో ఎక్కువగా  ఇబ్బంది పడుతుంటారు. ఎందుకంటే తమ్ముడు, చెల్లెలు రాకముందు అమ్మానాన్నలకి వాళ్లు తప్పించి మరో ప్రపంచం ఉండదు. వాళ్లతో ఎక్కువ టైం స్పెండ్​ చేస్తుంటారు. కానీ, మరొకరు ఇంటికొచ్చాక ప్రేమ అటు షిఫ్ట్​ అవుతుంది. చిన్నవాళ్లంటూ బాగా ముద్దుచేస్తుంటారు. దానివల్ల తమని నిర్లక్ష్యం చేస్తున్నారనే ఫీలింగ్​ కలగొచ్చు. దాంతో తోబుట్టువులతో గొడవలయ్యే అవకాశాలున్నాయి. అందుకే పిల్లలిద్దర్నీ సమానంగా చూడాలి.

గొడవలు పెంచొద్దు
కొన్నిసార్లు పేరెంట్స్​ తలదూర్చడం వల్ల  గొడవలు మరింత పెద్దవి అవుతాయి. అందువల్ల చిన్న సమస్యలైతే వాళ్లనే పరిష్కరించుకోనివ్వాలి. ఇలా చేయడం వల్ల ఎదిగే కొద్దీ వాళ్లలో సర్దుకుపోయే నేచర్​ అలవాటవుతుంది. అలాగే పిల్లలకి ఫ్యామిలీ రిలేషన్స్​ గురించి చెప్తుండాలి.  ఒకరిపట్ల మరొకరు బాధ్యతగా ఉండటం నేర్పించాలి. తోబుట్టువులు ఎంత చక్కగా మెలిగారన్న  కథలు చెప్పడం వల్ల కూడా ప్రయోజనం ఉంటుంది. అలాగే ఎంత పెద్ద గొడవైనా చెయ్యి చేసుకోకూడదని పిల్లలకి చెప్పాలి.