- వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచే అమలు
- జిల్లాకు మూడు చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 93 గురుకులాలు ఎంపిక
- ఎంట్రన్స్ టెస్ట్ మెరిట్ ఆధారంగా అడ్మిషన్లు
- ఏప్రిల్ 15 వరకు అప్లికేషన్లు, మే 3న ఎగ్జామ్
మంచిర్యాల, వెలుగు : ఇప్పటివరకు ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలకే పరిమితమైన ఐఐటీ, నీట్, క్లాట్ ఎగ్జామ్స్‌కు సంబంధించిన కోచింగ్ ఇక నుంచి కస్తూర్బా గాంధీ గురుకులాల్లో (కేజీబీవీ) చదువుతున్న స్టూడెంట్లకు సైతం అందనుంది. ఆయా ఎగ్జామ్స్‌కు సంబంధించిన కోచింగ్ ఇచ్చేందుకు జిల్లాకు మూడు చొప్పున మొత్తం 93 కేజీబీవీలను ప్రభుత్వం ఎంపిక చేసింది. ఆయా గురుకులాల్లో ఇంటర్ చదివే స్టూడెంట్లకు వచ్చే విద్యా సంవత్సరం నుంచే క్లాస్‌లను ప్రారంభించనుంది. ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహించి విద్యార్థుల ప్రతిభ ఆధారంగా అడ్మిషన్లు చేపట్టనున్నారు. ఈ ఏడాది టెన్త్ పరీక్షలు రాసిన బాలికలు ఎవరైనా ఎంట్రెన్స్ ఎగ్జామ్ రాసి సీటు పొందవచ్చు.
పేద బాలికలకు వరం
ఇప్పటివరకు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో నడుస్తున్న సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ (సీవోఈ)ల్లో మాత్రమే ఐఐటీ, నీట్, క్లాట్ కోచింగ్ ఇస్తున్నారు. తాజాగా ఈ విధానాన్ని కేజీబీవీల్లోనూ ప్రవేశపెట్టడం గవర్నమెంట్ స్కూళ్లలో చదువుకుంటున్న పేద బాలికలకు వరంగా మారనుంది.
ఎంతో మంది బాలికలు ఐఐటీ, నీట్, క్లాట్ వంటి పోటీ పరీక్షలు రాసి ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో చదువుకోవాలని ఆరాటపడుతున్నారు. కానీ వారికి సరైన కోచింగ్ లేకపోవడంతో సీట్లు రావడం కలగా మారింది. ప్రైవేట్, కార్పొరేట్ సంస్థల్లో ఈ కోచింగ్ తీసుకోవాలంటే లక్షల్లో ఖర్చువుతుంది. అంత ఆర్థిక స్థోమత లేనివారు ఇంటర్ కాగానే డిగ్రీతో పాటు వివిధ కోర్సుల్లో చేరిపోతున్నారు. ఈ క్రమంలో కేజీబీవీల్లో ఐఐటీ, నీట్, క్లాట్ కోచింగ్ ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని హర్షిస్తున్నారు.
ఇంటర్‌తో కోచింగ్
ప్రైవేట్, కార్పొరేట్ కాలేజీల్లో ఇంటర్‌తో పాటే ఐఐటీ, నీట్ కోచింగ్ ఇస్తుంటారు. ఫస్ట్ ఇయర్‌లో ప్రారంభించి సెకండ్ ఇయర్‌లో పూర్తిగా వాటిపైనే కాన్సెంట్రేషన్ చేస్తుంటారు. ఇదే తరహాలో కేజీబీవీల్లో సైతం ఎంపీసీ విద్యార్థులకు ఐఐటీ, బైపీసీ వారికి నీట్, సీఈసీ, ఇతర గ్రూపుల విద్యార్థులకు క్లాట్ కోచింగ్ ఇవ్వనున్నారు. ఇందుకోసం సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్స్‌ను నియమించనున్నారు. ఈ ప్రత్యేక శిక్షణకు అవసరమైన ఫండ్స్‌ను ఇప్పటికే ప్రభుత్వం రిలీజ్ చేసింది.
ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా అడ్మిషన్లు
ఎక్స్‌లెన్స్ కేజీబీవీల్లో టీజీఆర్జేసీ సెట్ 2026 ద్వారా అడ్మిషన్లు కల్పించనున్నారు. ఆన్‌లైన్ అప్లికేషన్లకు ఏప్రిల్ 15 వరకు గడువుంది. మే 3న టీజీ ఆర్‌జేసీ సెట్ నిర్వహించనున్నారు. ఇందులో సాధించిన మెరిట్ ఆధారంగా సీట్లు కేటాయిస్తారు. బాలికలు తమకు ఇంట్రెస్ట్ ఉన్న గ్రూపులను ఎంచుకోవచ్చు.
ఒక్కో జిల్లాకు మూడు కేజీబీవీలను సెలెక్ట్ చేయగా, ఒక్కో చోట ఒక్కోరకమైన కోచింగ్ అందించనున్నారు. మంచిర్యాల జిల్లాలోని మంచిర్యాల కేజీబీవీలో ఐఐటీ, బెల్లంపల్లిలో నీట్, తాండూరులో క్లాట్ కోచింగ్ ఇవ్వనున్నారు. ఒక్కో గ్రూపులో 40 సీట్లను భర్తీ చేసే అవకాశం ఉంది. ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని బాలికలు సద్వినియోగం చేసుకోవాలని మంచిర్యాల కేజీబీవీ సెక్టోరియల్ ఆఫీసర్ కే.విజయలక్ష్మి కోరారు.
