జనగామ అర్బన్, వెలుగు: రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు అందుబాటులో ఉండేలా ఐకేపీ రైతు సేవా కేంద్రాలను సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సూచించారు. గురువారం జనగామ మండలంలోని మరిగడి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన రైతు సేవా కేంద్రాన్ని ఆయన ప్రారంభించి పరిశీలించారు.
ఈ సందర్భంగా కేంద్రంలో విక్రయించే వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించిన లైసెన్సులను స్పష్టంగా ప్రదర్శించాలని, రైతులకు పూర్తి సమాచారం అందించాలని ఆదేశించారు. నాణ్యమైన విత్తనాలు, ప్రమాణాలకు అనుగుణమైన ఎరువులు, పురుగుమందులనే విక్రయించి నకిలీ ఉత్పత్తులకు తావులేకుండా చూడాలని సూచించారు.
అనంతరం ఈ-పాస్ యంత్రం, విక్రయాల నమోదు, బిల్లుల జారీ, నిల్వల నిర్వహణను పరిశీలించారు. ప్రతి లావాదేవీకి తప్పనిసరిగా బిల్లు ఇవ్వాలని ఆదేశించారు. కేంద్రాలను క్రమబద్ధంగా నిర్వహిస్తే నెలకు రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు ఆదాయం పొందవచ్చని తెలిపారు. కార్యక్రమంలో ఏపీడీ నూరుద్దీన్, అధికారులు, మహిళా సభ్యులు పాల్గొన్నారు.
