ప్రగతి భవన్ ను ముట్టడిస్తాం.. ఐకేపీ వీవోఏల ఆందోళన

ప్రగతి భవన్ ను ముట్టడిస్తాం.. ఐకేపీ వీవోఏల ఆందోళన

ఐకేపీ వీవోఏలు వారి డిమాండ్ల సాధన కోసం హైదరాబాద్ గన్ పార్క్ అమర వీరుల స్థూపం దగ్గర ఆందోళనకు దిగారు. వీరి ఆందోళనకు బీసీ పొలిటికల్ జేఏసీ మద్దతు తెలిపింది. ఐకేపీ వీవోఏల పట్ల వివక్ష చూపుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కు మంచి బుద్ధి ప్రసాదించాలని అమరవీరుల స్థూపానికి వినతిపత్రం అందజేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఐకేపీ వీవోఏ ఉద్యోగులు తమ సమస్యలను పరిష్కరించాలని.. గత 20 రోజులుగా సమ్మె చేస్తుంటే ప్రభుత్వం స్పందించకపోవడం చాలా దారుణమన్నారు జేఏసీ నేతలు. 

20 ఏళ్లుగా పనిచేస్తున్న వీవోఏలకు నెలకు కేవలం రూ.3,900 జీతం ఇస్తూ 30 రకాల పనులను చేయిస్తూ తీవ్ర శ్రమ దోపిడీకి పాల్పడుతుందన్నారని జేఏసీ నేతలు విమర్శించారు. రాష్ట్రంలో మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఇతర ఉద్యోగులకు జీతాలు పెంచిన ప్రభుత్వానికి వీవోఏలకు జీతాలు పెంచటానికి మాత్రం మనసు రావటం లేదన్నారు.

వీవోఏలను సెర్ఫ్ ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనం రూ.26 వేలు చెల్లించడంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించి.. రూ.10 లక్షల ఆరోగ్య భీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. వీరి డిమాండ్లను పరిష్కరించకపోతే వీవోఏలతో కలిసి ప్రగతి భవన్ ముట్టడిస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.