
- 30 ఏండ్ల నుంచి ఉంటున్నం ఇండ్లు కూలిస్తే ఏడికి పోవాలె
- రెవెన్యూ, ఇరిగేషన్ నోటీసులతోభయపడుతున్న సామాన్యులు
- ఖాళీ చేయాలన్న ఆదేశాలతో జనాల పరేషాన్
- కూకట్పల్లి, చందానగర్ పరిధిలోని 100 మందికి పైగా నోటీసులు
- ఎప్పుడు కూలుస్తారోనని అనుక్షణం భయం..భయం..
కూకట్పల్లి/చందానగర్, వెలుగు: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కబ్జాలతో కనుమరుగవుతున్న చెరువులు, కుంటలను కాపాడాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘హైడ్రా’ కూల్చివేతలతో ఆక్రమణదారులను హడలెత్తిస్తోంది. మరోవైపు ఇప్పటివరకు సైలెన్స్‌గా ఉండి హైడ్రా రాకతో యాక్టివ్ అయిన రెవెన్యూ, ఇరిగేషన్ ఆఫీసర్లు కూడా తమ పని కూడా మొదలుపెట్టారు. చెరువుల ఎఫ్టీఎల్, బఫర్ జోన్ల పరిధిలో ఇండ్లు కట్టుకున్నారంటూ కొద్ది రోజుల నుంచి నోటీసులు ఇవ్వడం స్టార్ట్ చేశారు.
గురువారం కూకట్పల్లి, దానగచంర్తో పాటు మరికొన్ని ప్రాంతాల్లోని చెరువుల ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో ఇండ్లు కట్టుకున్నారంటూ 315 మందికి నోటీసులిచ్చిన విషయం తెలిసిందే. కొద్ది రోజుల్లోనే వారిని ఖాళీ చేయాలని నోటీసుల్లో పేర్కొన్నారు. దీంతో కూలి చేసుకుంటూ చిన్న ఇండ్లు కట్టుకుని ఉంటున్నవారు, ఊర్లలో భూములుమ్ముకుని ఇక్కడ పక్కా ఇండ్లు కట్టుకున్న వారు, రిటైర్డ్మెంట్ తర్వాత వచ్చిన డబ్బులతో ఇండ్లు నిర్మించుకుని ఉంటున్నవారు భయపడుతున్నారు. ఎప్పుడు కూలుస్తారోనని ఆందోళన చెందుతున్నారు.
హైడ్రా రాకతో అందరిలోనూ ఆనందం
చెరువుల పరిరక్షణే లక్ష్యంగా ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసింది. చెరువులను ఆక్రమించిన బడాబాబుల పని పట్టాలంటూ ప్రత్యేక అధికారాలివ్వగా హైడ్రా కూడా ఎవరినీ లెక్కచేయకుండా పని చేస్తోంది. కమర్షియల్ పర్పస్‌లో నిర్మించిన పెద్ద బిల్డింగులను కూల్చేవేయడం మొదలుపెట్టింది. మాదాపూర్‌లో ఎన్ కన్వెన్షన్ సెంటర్‌ను కూడా నేలమట్టం చేసింది. దీంతో హైడ్రా పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోయింది. అప్పటి నుంచీ అందరూ హైడ్రా గురించే మాట్లాడుకోవడం మొదలుపెట్టారు.
నగరం నలుదిక్కులా చెరువులు, కుంటలను మింగిన తిమింగళాలను లక్ష్యంగా చేసుకునే హైడ్రా ఏర్పడిందని, పేదలు ఎక్కడైనా చెరువుల పరిధిలో ఇండ్లు నిర్మించుకుంటే వారి పట్ల సానుభూతితో వ్యవహరిస్తామని సీఎం రేవంత్‌రెడ్డితో పాటు హైడ్రా కమిషనర్రంగనాథ్ కూడా ప్రకటించారు. అది కూడా దశాబ్దాల కింద కట్టుకుని ఉంటున్న వారి గురించి ఆలోచిస్తామని చెప్పడంతో చెరువులున్న ప్రాంతాల్లో ఇండ్లు కట్టుకుని ఉంటున్న పేదలు సంబురపడ్డారు. తమ వరకూ హైడ్రా రాదని ప్రశాంతంగా ఉండొచ్చని భావించారు.
రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల ఎంట్రీతో..
హైడ్రా ఒక వైపు కూల్చివేతలు కొనసాగిస్తుంటే తాము కూడా చేయాలనే ఉద్దేశంతో రెవెన్యూ, ఇరిగేషన్ శాఖ అధికారులు రంగంలోకి దిగి నోటీసులు ఇవ్వడం మొదలుపెట్టారు. అయితే, వీరు పేదల వెంట పడుతున్నారన్న ఆరోపణలున్నాయి. కూకట్పల్లి మండలం శంషీగూడ పరిధిలోని అంబీర్(ప్రగతినగర్)చెరువు సమీపంలో 30 ఏండ్ల క్రితమే శ్రీరామ్నగర్పేరుతో 80 గజాల ప్లాట్లు చేసి విక్రయించారు. అప్పట్లో పలు జిల్లాల నుంచి నగరానికి వలస వచ్చి కూలి పనులు, చిరు వ్యాపారాలు చేసుకునే వారు ఇక్కడ ప్లాట్లు కొని రేకుల షెడ్లు నిర్మించుకున్నారు.
ఇక్కడ మూడు వందల ఇండ్లుంటే సగం మంది ఇప్పటికీ రేకుల షెడ్లలోనే ఉంటున్నారు. కొంతమంది ఊర్లలో ఉన్న ఆస్తులు అమ్ముకుని వచ్చి పక్కా ఇండ్లు నిర్మించుకున్నారు. అంతా మంచిగానే సాగిపోతుందనుకుంటున్న తరుణంలో రెండు రోజుల కింద ఖాళీ చేయాలంటూ 40 మందికి రెవెన్యూ అధికారులు నోటీసులు ఇచ్చారు. 35 ఏండ్ల కింద నుంచి ఇక్కడే ఉంటున్నామని, ఇప్పుడు ఎక్కడికి వెళ్లాలని వారు ఆందోళన చెందుతున్నారు. రాత్రి నిద్ర కూడా పట్టడం లేదంటున్నారు. సీఎం తమ గురించి ఆలోచించి న్యాయం చేయాలని కోరుతున్నారు.
తిరస్కరించిన పద్మావతినగర్వాసులు
కూకట్పల్లి మండలం అల్లాపూర్ పరిధిలోని సున్నం చెరువు ఎఫ్టీఎల్, బఫర్ జోన్ పరిధిలో వెలసిన నిర్మాణాలకు నోటీసులివ్వడానికి రెవెన్యూ ఆఫీసర్లు ప్రయత్నించగా వారు తీసుకోలేదు. 25 ఏండ్ల నుంచి ఇండ్లు కట్టుకుని ఉంటున్నామని, ఇప్పుడు ఖాళీ చేయమంటే ఎలా చేస్తామని ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ 200 కుటుంబాలుండగా సుమారు 20 మందికి నోటీసులు రెడీ చేశారు. విషయం తెలుసుకున్న కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు శుక్రవారం బస్తీని సందర్శించారు. బడా బాబులు బిల్డింగ్‌లను కూల్చితే సంపూర్ణంగా సహకరిస్తామని, పేదల జోలికి మాత్రం రావొద్దన్నారు.
గంగారం పెద్ద చెరువు దగ్గర..
చందానగర్ పరిధిలోని గంగారం పెద్ద చెరువుకు అనుకొని ఉన్న శ్రీరాంనగర్ కాలనీలో 99 ప్లాట్లు ఉంటే 26 ఇండ్లు ఎస్టీఎఫ్‌లోకి వస్తాయని రెవెన్యూ అధికారులు నోటీసులిచ్చారు. ఈ కాలనీలో బీహెచ్ఈఎల్, సెంట్రల్ వర్సిటీ, ఇతర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగులుంటున్నారు. వీరంతా రిటైర్మెంట్ తర్వాత వచ్చిన డబ్బులతో ఇండ్లు కట్టుకుని ప్రశాంత జీవనం గడుపుదామని అనుకున్నారు. కానీ, శేరిలింగంపల్లి రెవెన్యూ ఆఫీసర్ల నుంచి నోటీసులు రావడంతో ఇండ్లను కూల్చివేస్తారేమోనని భయపడుతున్నారు. కాలనీవాసులంతా హైడ్రా కమిషనర్‌ను, సీఎంను కలిసి బాధలను చెప్పుకోవాలని చూస్తున్నారు. లేకపోతే న్యాయసలహా తీసుకోవాలనే యోచనలో ఉన్నారు.
ఈమె పేరు బుచ్చమ్మ. 35 ఏండ్ల కింద పాలమూరు జిల్లా నుంచి సిటీకి వచ్చి కూలి పని చేస్తూ బతుకుతోంది. కూకట్పల్లి పరిధిలోని శంషీగూడలో ఉన్న శ్రీరామ్నగర్బస్తీలో అప్పట్లో 80 గజాలు కొని షెడ్డు నిర్మించుకుంది. భర్త కొన్నేండ్ల కిందటే చనిపోయాడు. ఈమెకు ఇద్దరు కొడుకులు, కూతురు కాగా, కొడుకులు కూడా కూలీలే. రెండు రోజుల కింద రెవెన్యూ అధికారులు అంబీర్(ప్రగతినగర్)చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో బుచ్చమ్మ ఇల్లు ఉందని ఖాళీ చేయాలని నోటీసులు ఇచ్చారు. రెక్కల కష్టం మీద ఆధారపడి బతుకుతున్న తమకు ఈ ఇల్లు ఒక్కటే ఆధారమని, ఖాళీ చేయిస్తే చావు తప్ప మరో గత్యంతరం లేదని వాపోతోంది.
వీరిద్దరూ యాదమ్మ, పాండయ్య దంపతులు. వికారాబాద్ జిల్లా మోత్కుపల్లికి చెందిన వీరు 25 ఏండ్ల కింద నగరానికి వచ్చి కూరగాయలు అమ్ముతూ బతుకుతున్నారు. 20 ఏండ్ల కింద శ్రీరామ్‌నగర్‌లో ప్లాట్ కొని షెడ్డు నిర్మించుకుని ఉండేవారు. కొన్ని నెలల కింద ఊర్లో పొలం అమ్మి రూ.50 లక్షలతో ఇక్కడ పక్కా ఇల్లు కట్టుకున్నారు. మొన్న అధికారులు వచ్చి అంబీర్ (ప్రగతినగర్)చెరువు శిఖం పరిధిలో ఇల్లు కట్టావంటూ నోటీసులు ఇచ్చి పోయారు. దీంతో అప్పటినుంచి భయపడుతున్నారు. 25 ఏండ్ల తర్వాత అధికారులు నోటీసులు ఇస్తారని తెలియక ఊర్లో పొలం అమ్ముకుని ఇల్లు కట్టుకుని పాపం చేశామని వాపోతున్నారు. తమ ఇంటిని కూల్చేస్తే కుటుంబంతో సహా ఉరేసుకుని చస్తామని అంటున్నాడు.
ఇల్లే ఆధారం.. కూల్చేస్తే రోడ్డున పడుతాం..
నేను స్కూల్ టీచర్ గా పనిచేసి 2010లో రిటైర్డ్ అయ్యా. నా భర్త శ్రీధర్‌రావు కూడా రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయే..ఆయన ఇటీవలే చనిపోయారు. మేము 1986–-87లో చందానగర్ పరిధిలోని శ్రీరాంనగర్ కాలనీలో ఇల్లు కట్టుకున్నాం. ఆగస్టు 8న శేరిలింగంపల్లి రెవెన్యూ అధికారులు వచ్చి మా ఇల్లు ఎఫ్టీఎల్లో ఉందని నోటీసులిచ్చారు. 30 రోజుల్లో చర్యలు తీసుకోకపోతే కూల్చివేస్తామని చెప్పారు. 37 ఏండ్లుగా కాలనీలో ఉంటున్నా.. అన్ని అనుమతులు తీసుకొని ఇల్లు కట్టుకున్నా. రిటైర్డ్ తర్వాత వస్తున్న పింఛన్ డబ్బులే ఆధారం. ఇప్పుడు ఇల్లు ఖాళీ చేసి పొమ్మంటే నా పరిస్థితి ఏమిటి?
- అంజలి, రిటైర్డ్ టీచర్