- ప్రైవేటు కాలేజీల నుంచి అడ్మిషన్లు ఫార్వార్డ్
- మధ్యలోనే బోర్డు తిప్పేస్తున్న అకాడమీలు
- ఆగమవుతున్న విద్యార్థులు
బన్సాల్ క్లాసెస్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట దేశవ్యాప్తంగా ఐఐటీ -నీట్ కోచింగ్ స్టడీ సెంటర్లు వందకు పైగా ఉన్నాయి. ఇదే బన్సాల్ పేరును పోలిన విధంగా ఎస్ బీ బన్సాల్ క్లాసెస్ పేరిట ఓ వ్యక్తి సరిగ్గా ఏడాది క్రితం కరీంనగర్ సిటీలోని కోర్టు చౌరస్తా, రేకుర్తిలో కోచింగ్ సెంటర్ తెరిచాడు. ఐఐటీ, నీట్ సీట్లు వచ్చేలా కోచింగ్ ఇస్తామని విద్యార్థులకు స్థానికంగా ఓ ప్రైవేట్ జూనియర్ కాలేజీ నుంచి అడ్మిషన్ తీసుకుని.. ఏడాదిపాటు తన ఇన్స్టిట్యూట్ లో క్లాసులు చెప్పారు. వారికి సెకండియర్ లోనూ ఐఐటీ, నీట్ ఎంట్రన్స్ కోసం క్లాసులు చెప్పి ఎగ్జామ్ రాయించాల్సి ఉండగా.. ఏడాదికే మూసేశారు. రెండేళ్ల క్రితం మంచిర్యాలలోనూ సదరు వ్యక్తి ఇలాగే సెంటర్ తెరిచి ఏడాదిలోపే క్లోజ్ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఈయనే ప్రస్తుతం కొత్తగా గోదావరిఖని జ్యోతినగర్ లో సెంటర్ తెరిచి అడ్మిషన్లకు తెరలేపడం గమనార్హం.
కరీంనగర్, వెలుగు: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఐఐటీ, నీట్ కోచింగ్ పేరిట పుట్టగొడుగుల్లా అకాడమీలు వెలుస్తున్నాయి. భారీ హోర్డింగులు, ప్రకటనలతో ప్రచారం చేస్తూ నిర్వాహకులు విద్యార్థుల తల్లిదండ్రులను ఆకర్షిస్తున్నారు. అడ్మిషన్లు తగ్గిన ప్రైవేట్ జూనియర్ కాలేజీలతో ఒప్పందాలు చేసుకుని విద్యార్థుల అడ్మిషన్లు ఫార్వర్డ్ చేసుకుంటూ, పరీక్షలు ఆ కాలేజీల పేర్లపై రాయిస్తూ క్లాసులు మాత్రం అకాడమీల్లో నిర్వహిస్తున్నారు. ఇంటర్ బోర్డు అనుబంధం లేకుండా, ప్రభుత్వ అనుమతులు తీసుకోకుండానే ఈ కేంద్రాలు నడుస్తున్నాయి.
ఐఐటీ, జేఈఈ, నీట్ కోచింగ్ పేరుతో...
కరీంనగర్ నగరంలో ఐదుకుపైగా ఐఐటీ, జేఈఈ, నీట్ కోచింగ్ అకాడమీలు ఉన్నాయి. టెన్త్ పూర్తిచేసిన విద్యార్థులకు ఇంటర్ అడ్మిషన్‌తో పాటు కోచింగ్ ఇస్తున్నారు. ఒక్కో విద్యార్థి నుంచి రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు ఫీజులు వసూలు చేస్తున్నారు. అయితే వీటికి ఇంటర్ బోర్డు నుంచి అనుమతులు లేవు. ఇతర ప్రైవేట్ జూనియర్ కాలేజీల్లో ఎన్‌రోల్ చేయించి, అడ్మిషన్‌కు కమీషన్ చెల్లించి చివరకు ఆ కాలేజీల పేర్లపై పరీక్షలు రాయిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కొందరు విద్యార్థులకు తాము ఏ కాలేజీలో అడ్మిషన్ తీసుకున్నామో హాల్ టికెట్ వచ్చే వరకు తెలియని పరిస్థితి ఉంది. కొన్ని అకాడమీలు కొన్ని రోజుల పాటు నిర్వహించి మధ్యలో మూసేయడంతో విద్యార్థులు ఆగమవుతున్నారు.
పట్టింపు లేని అధికారులు..
గుర్తింపు లేని అకాడమీలు, ఇంటర్ కాలేజీల్లో చేరొద్దని చెబుతున్న ఇంటర్ బోర్డు అధికారులు.. చర్యలు మాత్రం తీసుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. గత ఏడాది కరీంనగర్‌లోని బన్సాల్ క్లాసెస్‌పై ఫిర్యాదు రావడంతో అధికారులు విచారణ చేసి లోపాలను గుర్తించారు. నిబంధనలకు విరుద్ధంగా ఇంటర్ అడ్మిషన్లు జరిగినట్టు తేలినా అప్పట్లో ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది.
అకాడమీలకు గుర్తింపు లేదు..
ఆకాశ్, బన్సాల్ లాంటి అకాడమీలకు ప్రభుత్వ గుర్తింపు లేదు. అలాంటి అకాడమీల్లో ఇంటర్ విద్యార్థులు చేరొద్దు. మాకు ఇటీవల మెట్ పల్లి నుంచి ఒక కంప్లైంట్ వచ్చింది. గతేడాది జిల్లా ఇంటర్ బోర్డు అధికారులం బన్సాల్ కు వెళ్లాం. అక్కడ జగిత్యాల అవతలి నుంచి వచ్చిన పిల్లలు, వారి తల్లిదండ్రులు ఉన్నారు. తమకు తెలిసిన సార్ తీసుకొచ్చి ఇక్కడ చేర్పించారని చెప్పారు. అందుకే గుర్తింపు ఉన్న ఇంటర్ కాలేజీల్లోనే తమ పిల్లలను చేర్పించాలని తల్లిదండ్రులకు సూచిస్తున్నాం.
- ఆంజనేయరావు, డీఐఈవో, కరీంనగర్
