ఆ నాయకుడి సమక్షంలో తెల్లవార్లు రికార్డు డ్యాన్సులు

ఆ నాయకుడి సమక్షంలో తెల్లవార్లు రికార్డు డ్యాన్సులు
  • రాత్రి 9 నుంచి తెల్లవార్లు వందల మందితో విందు
  • ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన
  • టీఆర్ఎస్ పార్టీ నాయకుడి తీరుపై దుమారం

వికారాబాద్: అధికార పార్టీ నాయకుడు కరోనా రూల్స్ ను ఏ మాత్రం ఖాతరు చేయలేదు. లాక్ డౌన్.. కర్ఫ్యూ.. సోషల్ డిస్టెన్స్.. మాస్కులు గట్రా రూల్స్ అన్నింటిని తూచ్ అంటూ.. అర్ధరాత్రి వరకు వందల మందితో విందు చేసుకున్నాడు. ఓస్ ఇంతేనా అనుకోవద్దు.. చెవులు హోరెత్తించేలా ఫుల్ డీజే సౌండ్ సిస్టమ్ తో అర్ధనగ్నంగా ఉన్న అమ్మాయిలతో జోరుగా రికార్డింగ్ డ్యాన్సులు..  స్టెప్పులతో చిందులు వేశారు. పరిగి నియోజకవర్గంలోని దోమ మండలం దిర్సంపల్లి గ్రామంలో జరిగిందీ ఘటన. నిర్వహించింది స్వయానా అధికార టీఆర్ఎస్ పార్టీ నాయకుడు కాబట్టి ఎవరూ నోరు మెదపలేదు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన సంచలనం సృష్టిస్తోంది. అధికార పార్టీ నాయకుడి సమక్షంలో జరుగుతున్న ఈ విందు తతంగానికి దోమ మండల కేంద్రం నుంచి పోలీసులు అక్కడికి వెళ్లి చుసి అక్కడ జరుగుతున్న విందులో తిని గుట్టు చప్పుడు కాకుండా వెళ్లిపోయినట్లు సమాచారం. ఈ ఉదంతంపై దోమ ఎస్సై రాజుకు తెలిసినా పై అధికారులకు వివరణ ఇవ్వకుండా గోప్యంగా ఉంచారు. ఆలస్యంగా ఈ విషయం బయటపడడంతో దుమారం రేపుతోంది. 
దోమ మండలం దిర్సంపల్లి గ్రామంలో టీఆర్ఎస్ నాయకుడు పిల్లి మొగులయ్య ఈనెల 11  రాత్రి 9 నుంచి ఉదయం పొద్దుపొడిచే వరకు అంటే దాదాపు తెల్లవార్లు రికార్డు డ్యాన్స్ నిర్వహించారు. లాక్ డౌన్ నిబంధనలను తుంగలో తొక్కి గ్రామంలో అర్థనగ్న డ్యాన్సులతో, డీజే మ్యూజిక్కులతో హోరెత్తించారు. ఈ విషయం గురించి తెలిసి కూడా స్థానిక పోలీస్ స్టేషన్ సిబ్బంది చూసి చూడనట్లు వ్యవహరించారు. సాయంత్రం 6 ఐతే చాలు రోడ్డు మీదకు ఒక్క వ్యక్తిని రానివ్వని పోలిసులు వందల మంది కలిసి నిర్వహించిన ఈ కార్యక్రమం గురించి ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం విమర్శలకు గురవుతోంది. స్థానిక పోలిసు అధికారులపై తీరుపై పలువురు విమర్శిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి  నేతపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.