చెన్నూరులో.. ఇసుక దందా బంద్..ఓవర్ లోడింగ్, జీరో, ఎక్స్ట్రా కలెక్షన్లకు బ్రేక్

చెన్నూరులో.. ఇసుక దందా బంద్..ఓవర్ లోడింగ్, జీరో, ఎక్స్ట్రా కలెక్షన్లకు బ్రేక్
  • రీచ్​లలో సీసీ కెమెరాల ద్వారా మానిటరింగ్
  • టీజీఎండీసీ, మైనింగ్, రెవెన్యూ, పోలీస్​ సిబ్బంది నిఘా 
  • అక్రమార్కులపై క్రిమినల్​ కేసులకు ఆదేశించిన మినిస్టర్​
  • మీ సేవలో ఈజీగా ఇసుక బుక్​ చేసుకునేలా కొత్త సిస్టం 
  • అభివృద్ధి పనులకు, ఇందిరమ్మ ఇండ్లకు ఫ్రీగా సప్లై

“ ఇది మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం ఎర్రాయిపేట పరిధి గోదావరిలోని పలుగుల‌‌‌‌–3 రీచ్. దీనికి జయశంకర్ ​భూపాలపల్లి జిల్లాలోని పలుగుల వద్ద పర్మిషన్ ​రాగా, అక్కడ ఇసుక లభ్యత లేకపోవడంతో ఎర్రాయిపేటలో స్టాక్​యార్డు ఏర్పాటుకు గత ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం ఇక్కడ రోజుకు దాదాపు150 లారీలు లోడ్​చేస్తున్నారు. రీచ్​లో ఉన్న వేబ్రిడ్జి పైనే కాంటా వేస్తున్నారు. నిర్ణీత పరిమితి కంటే ఎక్కువ ఇసుక ఉంటే ఇలా జేసీబీతో తొలగిస్తున్నారు. తక్కువ ఉంటే ఆ మేరకు నింపుతున్నారు. ఇదంతా సీసీ కెమెరాలతో మానిటరింగ్​చేసి వే బిల్లు జారీ చేస్తున్నారు. టీజీఎండీసీ, మైనింగ్​, రెవెన్యూ, పోలీస్​ సిబ్బంది పర్యవేక్షణలో ఎలాంటి అక్రమాలు జరుగకుండా చర్యలు తీసుకుంటున్నారు.  

మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల జిల్లా చెన్నూరు​లో అక్రమ ఇసుక దందా బంద్​అయింది.  మంత్రి జి.వివేక్​ వెంకటస్వామి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నియోజకవర్గంలో అక్రమ ఇసుక రవాణాపై ఫోకస్​ పెట్టి పూర్తిగా కంట్రోల్​ చేశారు. కోటపల్లి మండలం కొల్లూర్​ గోదావరి నదిలో 40 లక్షల క్యూబిక్​ మీటర్ల ఇసుక తవ్వకాలకు గత సర్కార్ పర్మిషన్​ ఇచ్చింది. ఇక్కడ మొత్తం పది రీచ్​లు ఉండగా, ప్రస్తుతం ఒకట్రెండు మాత్రమే ఉన్నాయి. మంత్రి వివేక్​ఆదేశాలతో ఓవర్ లోడ్, జీరో దందాను పూర్తిగా నియంత్రించారు. 

ఇంతకుముందు పనిచేయని సీసీ కెమెరాలను వినియోగంలోకి తీసుకొచ్చారు. ప్రైవేట్​కాంటాలను బంద్​చేసి రీచ్​ల్లోని ప్రభుత్వ కాంటాలను పునరుద్ధరించారు. టీజీఎండీసీ, మైనింగ్​, రెవెన్యూ, పోలీస్​ సిబ్బందితో నిఘా ఏర్పాటు చేశారు. లోడింగ్​ చార్జీలు, ఫైన్​ క్వాలిటీ పేరిట అదనపు వసూళ్లు బంద్​చేశారు. ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే లోడింగ్​చేస్తారు.  లారీల్లో నిర్ణీత పరిమితికి మించి ఇసుక తీసుకపోకుండా పకడ్బందీ చర్యలు చేపట్టారు. 

రాష్ట్రవ్యాప్తంగా కట్టడికి చర్యలు 

ఇసుక అక్రమ దందాపై రాష్ర్ట ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. అక్రమ రవాణా ద్వారా ఓవైపు సర్కారు ఆదాయానికి గండి కొడుతూ మరోవైపు ఎక్కువ రేట్లతో వినియోగదారులను దోచుకుంటున్న మాఫియాపై కొరడా ఝుళిపిస్తోంది. కాంగ్రెస్​ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్​రెడ్డి సాండ్​మాఫియాను కంట్రోల్​ చేయాలని అధికారులకు ఆర్డర్స్​ఇవ్వడం తెలిసిందే.

 ఇటీవల మైనింగ్​శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వివేక్​ వెంకటస్వామి దీనిపై మరింత ఫోకస్​పెట్టారు. సాండ్​ రీచ్​లలో రూల్స్​ను స్ర్టిక్ట్​గా అమలు చేయడంతో పాటు అక్రమ రవాణాదారులపై క్రిమినల్​ కేసులు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో రాష్ర్టవ్యాప్తంగా అధికార యంత్రాంగం అలర్ట్​ అయింది. సాండ్​దందాను కట్టడి​చేయడానికి పకడ్బందీ చర్యలు తీసుకుంటోంది. 

బీఆర్ఎస్ హయాంలో యథేచ్ఛగా..

రాష్ర్టంలో గత బీఆర్ఎస్​ హయాంలో ఇసుక దందా యథేచ్ఛగా సాగింది. మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, జయశంకర్​ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబ్​నగర్, నాగర్​ కర్నూల్ తదితర జిల్లాలోని గోదావరి, మానేరు, కృష్ణా నదుల్లో విచ్చలవిడిగా ఇసుక రీచ్​లకు అప్పటి ప్రభుత్వం పర్మిషన్లు ఇచ్చింది.  ఆ పార్టీ లీడర్లు, కొందరు ఎమ్మెల్యేలు, మంత్రులు తెరవెనుక ఉండి సాండ్​ మాఫియాను నడిపించారు. 

ఇసుక రీచ్​లలో నిర్ణీత లోడ్ ​కంటే మూడు నాలుగు బకెట్లు ఎక్కువ పోసేవారు. ఒక్కో బకెట్​కు రూ.1500 నుంచి రూ.2వేల చొప్పున లారీకి రూ.4 వేల నుంచి రూ.5వేలు తీసుకునేవారు. ఫైన్ ​క్వాలిటీ సాండ్​కు రూ.5వేల దాకా అదనంగా వసూలు చేసేవారు. కొన్ని రీచ్​లలో జీరో దందా యథేచ్ఛగా సాగించారు. ఒకే వే బిల్లుపై రెండు మూడు ట్రిప్పులు వేయడంతో పాటు దొంగ వే బిల్లులు సృష్టించి అక్రమ రవాణా చేశారు. రీచ్​లలో సీసీ కెమెరాలు ఉన్నా  అవి పనిచేసిన దాఖలాలు లేవు. 

టీజీఎండీసీ కాంటాల్లో కాకుండా బయట ప్రైవేట్​కాంటాలపై వేయింగ్​ చేస్తూ అక్రమాలకు పాల్పడ్డారు. మైనింగ్, రెవెన్యూ, పోలీస్​, ట్రాన్స్​పోర్ట్​ఆఫీసర్లు నామమాత్రంగా దాడులు నిర్వహించడం, కేసులు నమోదు చేయడం వరకు అంతా వ్యవస్థీకృతంగా కొనసాగింది. ఈ దందాతో సంబంధం ఉన్నవాళ్లంతా వందల కోట్లకు పడగలెత్తారనే ఆరోపణలు ఉన్నాయి.  

ఇసుక బుకింగ్​కు కొత్త సిస్టం

 గతంలో టీజీఎండీసీ వెబ్​సైట్​ద్వారా ఆన్​లైన్​లో సాండ్​ బుకింగ్​ చేసేవారు. టీజీఎండీసీ వద్ద రిజిస్టర్​అయిన లారీలకు ఇలా ఉండేది. ఆ సైట్​ ఎప్పుడు ఓపెన్​అవుతుందో, ఎప్పుడు క్లోజ్​అవుతుందో కొంతమందికే తెలిసేది. వారు మాత్రమే భారీగా లారీలు బుక్​ చేసుకునేలా వెసులుబాటు ఉండేది. మిగతా వారికి బుకింగ్​ కాకపోవడంతో నాలుగైదు రోజులు ఎదురుచూడాల్సి వచ్చేది. దీంతో ప్రభుత్వం ఇటీవలే మీ సేవ ద్వారా సాండ్​ బుకింగ్ సిస్టం తీసుకొచ్చింది. దీని ద్వారా బ్రోకర్ల ప్రమేయం లేకుండా ఎవరైనా, ఎక్కడినుంచైనా బుకింగ్​చేసుకోవచ్చు.

మైనింగ్​  రెవెన్యూ పెంచుతాం 

గత సర్కార్ హయాంలో విచ్చలవిడిగా ఇసుక దందా జరిగింది. ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతూ జీరో, ఓవర్​​ లోడ్​ దందా కొనసాగించారు.  ఎక్కువ రేట్లకు అమ్ముతూ వినియోగ దారులను దోపిడీ చేశారు. తద్వారా కొంతమంది లీడర్లు, మాఫియా కోట్లకు పడగలెత్తారు. నేను ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే సెగ్మెంట్ పరిధిలో ఇసుక దందాకు చెక్​పెట్టాను. మైనింగ్​మినిస్టర్​గా బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ర్టవ్యాప్తంగా ఇసుక దందాపై ఉక్కుపాదం మోపుతున్నాం.

  అక్రమ రవాణా చేసేవారిపై క్రిమినల్​ కేసులు పెట్టాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చాను. బ్రోకర్ల ప్రమేయం లేకుండా ఎవరైనా, ఎక్కడినుంచైనా మీ సేవలో ఇసుక బుకింగ్​చేసుకునేలా కొత్త సిస్టం తీసుకొచ్చాం. హైదరాబాద్​తో పాటు అన్ని జిల్లాల్లో సాండ్​బజార్లు ఏర్పాటు చేస్తున్నాం. మైనింగ్, రెవెన్యూ పెంచడానికి పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నాం. - జి.వివేక్​ వెంకటస్వామి, మైనింగ్​ శాఖ మంత్రి 

ఇందిరమ్మ ఇండ్లకు ఫ్రీ..

 ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లకు మాత్రం ఫ్రీగా ఇసుక సప్లై చేస్తోంది. ముందుగా తహసీల్దార్​పర్మిషన్​ తీసుకోవాలి. ట్రాక్టర్ ​లేదా లారీ నంబర్​తో పర్మిట్​ జారీ చేస్తే లోకల్​ వాగులు, నదుల నుంచి కావాల్సిన ఇసుకను ఫ్రీగా తీసుకోవచ్చు. ఇక లోకల్ ​యూజ్​ కోసం గోదావరిలో ముల్కల్ల, వేంపల్లి, సీతారాంపల్లి వద్ద, చెన్నూరు బతుకమ్మ వాగు, నెన్నెల మండలంలోని కర్జి వాగుల్లో ఐదు రీచ్​లను మైనింగ్​డిపార్ట్​మెంట్ నిర్వహిస్తోంది. ‘ మన ఇసుక వాహనం’ సైట్​ ద్వారా ఎవరైనా సాండ్​బుకింగ్​ చేసుకోవచ్చు. దూరాన్ని బట్టి చార్జీ వసూలు చేస్తున్నారు. ఇలా జిల్లాలో రోజుకు 1500 నుంచి 2 వేల ట్రాక్టర్ల ఇసుక రవాణా అవుతోంది.