కలెక్టర్ బాదావత్ సంతోష్
నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: జిల్లాలో అక్రమ ఇసుక తవ్వకాలపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ బాధావత్ సంతోష్ హెచ్చరించారు. సోమవారం కలెక్టరేట్లోని మీటింగ్ హాలులో ఎస్పీ సంగ్రామ్ సింగ్ తో కలిసి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ఎక్కడైనా అనధికార తవ్వకాలు జరిగితే వాటిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఇసుక బుకింగ్ పూర్తిగా ఆన్లైన్ విధానం ద్వారా ‘మన ఇసుక వాహనం’ యాప్ ద్వారానే జరగాలని స్పష్టం చేశారు. జిల్లాలో 15 ఇసుక రిచ్ల నుంచి తరలించాలన్నారు. నెంబర్ ప్లేట్లు లేకుండా ఇసుక తరలిస్తున్న వాహనాలను సీజ్ చేయాలని ఆదేశించారు.
చెక్ పోస్టుల వద్ద తనిఖీలు మరింత కఠినతరం చేయాలన్నారు. పోలీస్, రెవెన్యూ శాఖలు సమన్వయంతో పనిచేయాలని కోరారు. ప్రతీ ఇసుక రీచులకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని తెలిపారు. అలాగే అక్రమంగా ఉండే ఇసుక డంపులను గుర్తించి, చట్టబద్ధం చేయాలన్నారు.
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు అవసరమైన ఇసుక సరఫరా నిరంతరం కొనసాగుతుందన్నారు. వివిధ అభివృద్ధి పనులకు సాగునీటి ప్రాజెక్టులకు నిర్మాణాలకు అవసరమని, ఎలాంటి అంతరాయం లేకుండా ముందస్తు ప్రణాళికలు రూపొందించాలని సూచించారు.
