గోవా నుంచి లిక్కర్ తెచ్చి సిటీలో అమ్మకం.. ఐదుగురు అరెస్ట్ 521 లిక్కర్ ​బాటిల్స్ సీజ్

గోవా నుంచి లిక్కర్ తెచ్చి సిటీలో అమ్మకం.. ఐదుగురు అరెస్ట్ 521 లిక్కర్ ​బాటిల్స్ సీజ్

ఘట్​కేసర్, వెలుగు: గోవా నుంచి అక్రమంగా సిటీకి లిక్కర్ బాటిళ్లను తెచ్చి అమ్ముతున్న ఐదుగురిని ఘట్​కేసర్ ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. రంగారెడ్డి రీజియన్ ఎక్సైజ్ డిప్యూటీ సూపరింటెండెంట్ డేవిడ్ రవికాంత్ తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం రాత్రి బోడుప్పల్​లోని బంగారు మైసమ్మ ఆలయం వద్ద ఘట్​కేసర్ ఎక్సైజ్ సిబ్బంది తనిఖీలు చేపట్టారు. బైక్​పై అనుమానాస్పదంగా వెళ్తున్న  బోడుప్పల్​కు చెందిన అలకొండ జగదీశ్వర్​(54)ను అదుపులోకి తీసుకున్నారు.

 అతడి వద్ద10 సిగ్నేచర్ లిక్కర్​బాటిళ్లు దొరకడంతో ఎక్కడి నుంచి తెస్తున్నావని ప్రశ్నించగా, పున్నా బాలరాజు(53) అనే వ్యక్తి గోవా నుంచి అక్రమంగా తరలించిన లిక్కర్ బాటిళ్లను బోడుప్పల్​లో అమ్ముతున్నాడని జగదీశ్వర్ చెప్పాడు. ఆ సమాచారంతో ఎక్సైజ్ పోలీసులు  బోడుప్పల్​లోని బాలరాజు ఇంటికి వెళ్లారు. కారు డిక్కీలో దాచిన 83  లిక్కర్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. బాలరాజును విచారించగా.. 

సిద్దిపేటలోని శ్రీనగర్ కాలనీలో ఉండే తాళ్లపల్లి హరికృష్ణ గౌడ్,  దుద్దెడకు చెందిన బుచ్చిగారి శ్రీధర్(29) నుంచి తాను మద్యాన్ని కొన్నట్లు చెప్పాడు. ఎక్సైజ్ సిబ్బంది సిద్దిపేట, దుద్దెడకు వెళ్లి హరికృష్ణ, శ్రీధర్ ఇండ్లల్లో తనిఖీలు నిర్వహించారు. 399 బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. వారిద్దరిని కూడా అరెస్ట్ చేశారు. హరికృష్ణ సమాచారంతో నాచారంలోని అంబేద్కర్ భవన్​సమీపంలోని ఆముదాల సురేందర్(34) ఇంట్లో దాడులు చేసిన ఎక్సైజ్ సిబ్బంది 22 లిక్కర్ బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ మొత్తం దాడుల్లో రూ.12 లక్షల విలువైన 521 బాటిళ్లు, బైక్, డీసీఎం, 2 కార్లు, 5 సెల్​ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.