తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ, గురుకుల పాఠశాలలో విద్యార్థులు అస్వస్థతలకు గురి కావడం కామన్ అయిపోయింది. కలుషిత ఆహారం తిని వారు వాంతులు, విరోచనాలతో బాధ పడుతున్నారు. మొన్న బాసరలోని ట్రిపుల్ ఐటీలో కలుషిత ఆహారం తిని విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని గిరిజన ఆశ్రమ బాలిక పాఠశాలలో కూడా ఇదే విధంగా జరిగింది. ఇది మరిచిపోకముందే... మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న రాజన్న సిరిసిల్ల జిల్లాలో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనపై విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సిరిసిల్లలోని పెద్దూరు శివారులో మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాల ఉంది. ఇందులో పలువురు విద్యార్థులు చదువుకుంటున్నారు.
ఆదివారం హఠాత్తుగా విరేచనాలు, వాంతులు, జ్వరాలతో విద్యార్థులు బాధ పడ్డారు. విషయం తెలుసుకున్న హాస్టల్ సిబ్బంది వారి వారి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. అక్కడకు చేరుకున్న విద్యార్థుల పరిస్థితి చూసి తల్లిదండ్రులు చలించిపోయారు. హాస్టల్ యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వసతులు లేకుండానే ఎలా తెరుస్తారని ప్రశ్నించారు. కేటీఆర్ నియోజకవర్గంలోనే ఇలా ఉంటే రాష్ట్రంలో ఉన్న హాస్టల్ లో ఎలాంటి పరిస్థితులున్నాయో అర్థం చేసుకోవచ్చని మండిపడ్డారు. బీసీ సంక్షేమ హాస్టల్ లో ఫుడ్ పాయిజన్ జరిగిందని ఆరోపిస్తూ.. ఏబీవీపీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని వారిని అరెస్టు చేసి పీఎస్ కు తరలించారు.
