ఉగాది పచ్చడి ఎఫెక్ట్ .. 29 మంది స్టూడెంట్లకు అస్వస్థత

ఉగాది పచ్చడి ఎఫెక్ట్ .. 29 మంది స్టూడెంట్లకు అస్వస్థత

మెట్ పల్లి, వెలుగు: మెట్ పల్లి మహాత్మా జ్యోతి బా పూలే  గురుకుల రెసిడెన్షియల్ స్కూల్ లో బయటి నుంచి తీసుకొచ్చిన ఉగాది పచ్చడి తాగి 29 మంది స్టూడెంట్లు అస్వస్థతకు గురయ్యారు. కడుపునొప్పి, వాంతులు, మోషన్స్ తో ఇబ్బందులు పడగా మెట్​పల్లి ప్రభుత్వ దవాఖానాకు తరలించారు. కొద్ది రోజుల క్రితమే స్కూల్ బిల్డింగ్ రెండో అంతస్తు నుంచి ఓ స్టూడెంట్​ కిందపడి గాయపడగా శనివారం ఈ ఘటన చోటు చేసుకుంది. పట్టణ శివారులో ఓ ప్రైవేట్​బిల్డింగ్ లో కొన్నేండ్లుగా మహాత్మా జ్యోతిబాపూలే రెసిడెన్షియల్ స్కూల్ నిర్వహిస్తున్నారు. శనివారం ఉగాది నేపథ్యంలో ఐదో తరగతి చదువుతున్న ఓ స్టూడెంట్ పేరెంట్స్ రెండు లీటర్ల వాటర్ బాటిల్ లో ఉగాది పచ్చడి తీసుకువచ్చి ఇచ్చారు. మధ్యాహ్నం సదరు స్టూడెంట్ పచ్చడిని 40 మంది విద్యార్థులకు పోసింది. సాయంత్రం 5 గంటల ప్రాంతంలో నలుగురికి కడుపునొప్పితో పాటు మోషన్స్ మొదలయ్యాయి. టీచర్ కు చెప్పగా ఓఆర్ఎస్ తాగించారు. కడుపునొప్పి తగ్గలేదని చెప్పినా హాస్పిటల్ కు తీసుకువెళ్లలేదు. చివరికి రాత్రి 9 గంటల ప్రాంతంలో మెట్ పల్లి సివిల్ హాస్పిటల్ కు తరలించి అడ్మిట్ ​చేశారు. ఆదివారం తెల్లవారుజామున కూడా 22 మందికి కడుపునొప్పి, వాంతులు, మోషన్స్ కాగా, హాస్పిటల్ కు తరలించారు. మధ్యాహ్నం మరో ముగ్గురు కూడా అడ్మిట్​అయ్యారు.  దీంతో అస్వస్థతకు గురైన విద్యార్థుల సంఖ్య 29కి చేరుకుంది. హాస్పిటల్ లో బెడ్లు సరిపోకపోవడంతో ఒక్కో బెడ్ పై ఇద్దరిని పడుకోబెట్టి ట్రీట్​మెంట్​ ఇచ్చారు. ఈ విషయం తెలుసుకున్న స్టూడెంట్స్​ తల్లిదండ్రులు హాస్పిటల్​కు చేరుకుని తమకు ఎందుకు చెప్పలేదంటూ స్కూల్ ​స్టాఫ్​పై మండిపడ్డారు. ఎమ్మెల్యే విద్యాసాగర్​రావు దవాఖానాకు వచ్చి స్టూడెంట్స్​ను పరామర్శించారు. బయటి నుంచి తెచ్చిన పచ్చడిని ఎలా అనుమతించారని ప్రిన్సిపాల్, టీచర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు.  విద్యార్థుల బాధను చూసిన డాక్టర్ అమరేశ్వర్  వారికి వాటర్ బాటిల్స్, ఫ్రూట్స్ పంపిణీ చేశారు.

స్టాఫ్​ తక్కువగా ఉండడంతో చూడలే..

బయట ఫుడ్ స్కూల్ లోపలికి ఎట్టి పరిస్థితుల్లో అనుమతించం. ఉగాది కావడం, సిబ్బంది తక్కువగా ఉండడం, పేరెంట్స్ ఎక్కువగా రావడంతో గమనించలేకపోయాం. ఈ ఘటనపై విచారణ చేస్తాం.
- ఆనందం, ప్రిన్సిపాల్