తెలంగాణలో నాలుగు రోజులు వానలు..

తెలంగాణలో నాలుగు రోజులు వానలు..
  • వాతావరణ శాఖ వెల్లడి .. 20వ తేదీకి ఎల్లో అలర్ట్ జారీ 
  • 19న సీఎం మెదక్ టూర్ వాయిదా 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో నాలుగు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ బుధవారం వెల్లడించింది. ఈ నెల 17, 18, 19వ తేదీల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు.. 20వ తేదీన పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. 20వ తేదీకి ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆ రోజు కుమ్రం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్​ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. 

శుక్రవారం బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే చాన్స్ ఉందని, దాని ప్రభావంతో వర్షాలు పడే సూచనలు ఉన్నాయని చెప్పింది. కాగా, సీఎం కేసీఆర్​మెదక్​జిల్లా టూర్​వాయిదా పడింది. మెదక్​కలెక్టరేట్​కాంప్లెక్స్, ఎస్పీ ఆఫీస్​తో పాటు బీఆర్ఎస్​జిల్లా ఆఫీస్​ను ప్రారంభించేందుకు ఈ నెల 19న మెదక్​జిల్లాలో కేసీఆర్ పర్యటించాల్సి ఉంది. అయితే రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అలర్ట్​జారీ చేసిందని, అందుకే సీఎం టూర్​ను వాయిదా వేస్తున్నామని సీఎంవో ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 23న సీఎం మెదక్​జిల్లాలో పర్యటిస్తారని పేర్కొంది.