
హైదరాబాద్ వాతావరణం హీట్ గా ఉంది. రెండు, మూడు రోజులుగా ఉక్కబోత ఉంటోంది. వానాకాలంలో ఎండలు, ఉష్ణోగ్రతలు పెరగటంతో జనం అనారోగ్యంతో అల్లాడుతున్నారు.
జ్వరాలు, దగ్గు, జలుబులతో బాధపడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వెదర్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. హైదరాబాద్ సిటీలో ఆగస్ట్ 25, 26 తేదీల్లో అంటే.. శుక్రవారం, శనివారం ఉరుములు, మెరుపులతో మోస్తరు వర్షాలు పడతాయని హెచ్చరించింది.
హైదరాబాద్ సిటీ మొత్తం ఇలాంటి పరిస్థితి ఉండదని.. కొన్ని ప్రాంతాల్లోనే ఉంటుందని వెల్లడించింది వాతావరణ శాఖ. ఆకాశం మేఘావృతం అయ్యి.. జల్లులతోపాటు ఉరుములు, మెరుపులు ఉంటాయని. మరికొన్ని చోట్ల పిడుగులు పడే సూచనలు ఉన్నాయని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది వెదర్ డిపార్ట్ మెంట్.
ఇక తెలంగాణలో వాతావరణ పరిస్థితులను సైతం ప్రకటించింది. కుమురం భీం, పెద్దపల్లి, కరీంనగర్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, హన్మకొండ, ములుగు, వరంగల్, జనగాం, మహబూబాబాద్, కొత్తగూడెం, భువనగిరి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (TSDPS) నివేదిక ప్రకారం, కుమురం భీం జిల్లాలో ఆగస్టు 24న అత్యధికంగా 52.5 మిమీ వర్షపాతం నమోదైంది.ఈ సీజన్లో ఇప్పటివరకు సాధారణ వర్షపాతమే నమోదైంది.