
నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్న నేపథ్యంలో తెలంగాణకు వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. మరో మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. ఆదివారం ( మే 18 ) తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు అక్కడక్కడ భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడ్డ ఆవర్తనం నుండి ద్రోణి ఒకటి మధ్య కోస్తా ఆంధ్ర తీరం వరకు ఏర్పడిందని.. సగటు సముద్రమట్టం నుండి 1.5 & 5.8 కి. మీ ఎత్తులో ఏర్పడిందని తెలిపింది వాతావరణ శాఖ.ఈ ద్రోణి ఎత్తు పెరిగే కొద్దీ నైరుతి దిక్కుకు వ్యాపిస్తుందని తెలిపింది.
ద్రోణి ప్రభావంతో రానున్న మూడు రోజులలో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే మూడు నుండి ఐదు డిగ్రీలు తక్కువగా నమోదయ్యి... మూడు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. పరిస్థితులు అనుకూలంగా ఉన్న నేపథ్యంలో నైరుతి రుతుపవనాలు మరింత పురోగమిస్తూ.. దక్షిణ అరేబియా సముద్రం, దక్షిణ బంగాళాఖాతంలోని మరిన్ని ప్రాంతాలు, అండమాన్ సముద్రంలోని మిగిలిన ప్రాంతం, మధ్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలలోకి ప్రవేశించే అవకాశం ఉందని తెలిపింది.
ఆదివారం, సోమవారం ( మే 18, 19 ) రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో ఉరుములు మెరుపులతో.. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగం కలిగిన ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. ఇవాళ జోగులాంబ గద్వాల, మహబూబ్ నగర్, నగర్ కర్నూల్, నారాయణపేట, రంగారెడ్డి, వికారాబాద్, వనపర్తి జిల్లాల్లో అక్కడక్కడా కురిసే వకాశం ఉందని.. మిగతా జిల్లాల్లో సాధారణ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. హైదరాబాద్ లో చిరుజల్లులు కురిసే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ.