దొంగిలించిన సెల్​ఫోన్ల ఐఎంఈఐ నంబర్లు.. మార్చేసి సెకండ్స్ లో సేల్

దొంగిలించిన సెల్​ఫోన్ల ఐఎంఈఐ నంబర్లు.. మార్చేసి  సెకండ్స్ లో సేల్
  • నిందితుడి అరెస్ట్.. పరారీలో ఐదుగురు
  • రూ. కోటి 92 లక్షల విలువైన  
  • 563 సెల్ ఫోన్లు, కారు స్వాధీనం

గచ్చిబౌలి, వెలుగు: కొట్టేసిన సెల్ ఫోన్లను సేకరించి ఐఎంఈఐ (ఇంటర్నేషనల్ మొబైల్ ఎక్విప్ మెంట్ ఐడెంటిటీ) నంబర్ తో పాటు సాఫ్ట్ వేర్ ను మార్చి ఇతర రాష్ట్రాల్లో అమ్ముతున్న వ్యక్తిని రాయదుర్గం, మాదాపూర్ జోన్ ఎస్ వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు. రూ. కోటి 92 లక్షల విలువైన సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. బుధవారం రాయదుర్గం పీఎస్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాదాపూర్ డీసీపీ సందీప్.. ఏడీసీపీ నర్సింహారెడ్డి, ఏసీపీ శ్రీనివాస్ తో కలిసి వివరాలను వెల్లడించారు. ఏపీలోని కడపకు చెందిన  గారడి రామాంజి (54) సిటీకి వచ్చి ఎల్ బీనగర్​లో ఉంటున్నాడు. 1995 నుంచి 2005 వరకు ఫలక్​నుమా ఆర్టీసీ డిపోలో కండక్టర్​గా పనిచేశాడు. 2006లో జాబ్​ మానేసి రియల్​ఎస్టేట్ బిజినెస్​లోకి దిగాడు. పెద్ద మొత్తంలో డబ్బులు పొగొట్టుకున్నాడు. దీంతో ఈజీ మనీ కోసం దొంగిలించిన ఫోన్ల ఐఎంఈఐ, సాఫ్ట్ వేర్ ను మార్చి వాటిని వేరే ప్రాంతాల్లో అమ్మాలని ప్లాన్ చేశాడు. ఏపీలోని ఆకివీడు ప్రాంతానికి చెందిన ఆకాశ్, సన్నీ, కర్ణాటకకు చెందిన వంశీ వద్ద నుంచి దొంగిలించిన సెల్​ఫోన్లను రామాంజి కొనుగోలు చేశాడు. వారికి ఫోన్ మోడల్​ను బట్టి రూ.2 వేల నుంచి రూ.4 వేల వరకు ఇచ్చేవాడు. తాను కొనుగోలు చేసిన ఫోన్లలో ఐఎంఈఐ నంబర్లు, సాఫ్ట్​వేర్ ను మార్చి సిటీలోని ఆసిఫ్, అర్షద్​సాయంతో తెలుగు రాష్ట్రాల్లోని జనాలకు ఎక్కువ ధరకు అమ్మాడు. 

సోమవారం రాత్రి రాయదుర్గం పోలీసులు, మాదాపూర్​ జోన్​ఎస్ వోటీ పోలీసులు గచ్చిబౌలి చౌరస్తాలో వెహికల్ చెకింగ్ చేపట్టారు. ఈ క్రమంలో ఓ కారును చెక్ చేయగా.. 7 బాక్సుల్లో తరలిస్తున్న రూ.కోటి 92 లక్షల విలువైన 563 సెల్ ఫోన్లు, రూ.3 లక్షల క్యాష్​ కనిపించింది. రామాంజిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా నిజం బయటపడింది. ఈ కేసులో మరో ఐదుగురు నిందితులు పరారీలో ఉన్నారని, వారి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. రామాంజిని 2016లో సెల్​ఫోన్ దొంగతనాల కేసులో శామీర్​పేట్ పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు. 2021లో అబ్దుల్లాపూర్​మెట్​లో భూ కబ్జా కేసులో నిందితుడిగా ఉన్నాడు. రామాంజి నుంచి స్వాధీనం చేసుకున్న 250 సెల్ ఫోన్లను ఐఎంఈఐ నంబర్ గుర్తించి బాధితులకు అందజేస్తామని డీసీపీ సందీప్ తెలిపారు. మిగిలిన సెల్ ఫోన్లను కూడా ఫోరెన్సిక్  టీం సాయంతో గుర్తించి పోగొట్టుకున్న వారికి అందజేస్తామన్నారు.