- గ్రూప్1 దృష్ట్యా విశ్వ హిందూ పరిషత్ నిర్ణయం
- గుడి లాఠీచార్జ్ ఘటనలో బాధ్యులను 48 గంటల్లో సస్పెండ్ చేయాలని డిమాండ్
- గవర్నర్‌ను కలవనున్న బృందం
బషీర్ బాగ్, వెలుగు: సికింద్రాబాద్ ముత్యాలమ్మ గుడి దగ్గర శాంతియుతంగా నిరసన తెలుపుతున్న హిందువులపై లాఠీచార్జ్ కు పాల్పడిన పోలీసు అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని, విచారణ జరిపి విధుల నుంచి తొలగించాలని వీహెచ్‌పీ రాష్ట్ర ప్రచార ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి డిమాండ్ చేశారు. హైదరాబాద్ కోఠిలోని ఆఫీస్‌లో ఆదివారం ఆయన మాట్లాడారు. ఘటనకు నిరసనగా సోమవారం రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చామని, అయితే గ్రూప్1 ఎగ్జామ్ఉన్న దృష్ట్యా వారికి అభ్యర్థులకు ఇబ్బందులు కలగకుండా బంద్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు.
డీజీపీ చొరవ తీసుకొని లాఠీ చార్జ్ కు పాల్పడ్డ పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని, రాష్ట్ర ప్రభుత్వానికి, అధికారులకు 48 గంటల సమయం ఇస్తున్నామని, ఈలోపు చర్యలు లేకపోతే తమ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. లాఠీచార్జ్ ఘటనపై సోమవారం గవర్నర్ ను కలిసి వినతి పత్రం సమర్పిస్తామన్నారు. వరుసగా హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్నా సీఎం రేవంత్‌రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ స్పందించకపోవడం దారుణమన్నారు. సమావేశంలో వీహెచ్‌పీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సునీతా రామ్మోహన్ రెడ్డి, రాష్ట్ర సహకార్యదర్శి భాను ప్రసాద్, ధర్మ ప్రచార్ రాష్ట్ర సహ ప్రముఖ్ సుభాష్ చందర్ పాల్గొన్నారు.