
- భారతీయులకు అమెరికన్ ఎంబసీ హెచ్చరికలు
న్యూఢిల్లీ: వీసా గడువు ముగిసినా అమెరికాలో ఉంటున్న భారతీయులను ఉద్దేశించి ఢిల్లీలోని యూఎస్ ఎంబసీ హెచ్చరికలు జారీ చేసింది. ‘‘మీ వీసా నిబంధనలను గౌరవించండి. వీసా గడువు ఉన్నంత వరకే యూఎస్‌లో ఉండండి. గడువు ముగిసినా ఉంటే.. తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. వీసా రద్దు కావడంతో పాటు బహిష్కరణ ముప్పు, భవిష్యత్తులో వీసా రాకుండా అనర్హత వేటు పడే అవకాశం ఉంటుంది.
వీసా గడువు ముగిసినా అమెరికాలోనే ఉంటే.. మీరు భవిష్యత్తులో యూఎస్‌కు రాకుండా, అక్కడ చదువుకోకుండా, పని చేయడానికి వీల్లేకుండా శాశ్వత ప్రభావం పడొచ్చు” అని హెచ్చరించింది. ఈ మేరకు సోషల్ మీడియా ‘ఎక్స్’లో పోస్టు పెట్టింది. కాగా, అంతకుముందు అమెరికా చట్టసభ సభ్యురాలు టేలర్ గ్రీని.. హెచ్1-బీ వీసాలపై అమెరికాకు వచ్చే భారతీయులను ఉద్దేశించి అక్కసు వెళ్లగక్కారు. అమెరికన్ల ఉద్యోగాలను లాగేసుకునే భారతీయ హెచ్1-బీ వీసాలకు ముగింపు పలకండని వ్యాఖ్యలు చేశారు.