ఏడాది చివరిలో ఆచితూచి.. ఈ వారం మార్కెట్‌పై దేశీయ, గ్లోబల్ ఆర్థిక అంశాల ప్రభావం

ఏడాది చివరిలో ఆచితూచి.. ఈ వారం మార్కెట్‌పై దేశీయ, గ్లోబల్ ఆర్థిక అంశాల ప్రభావం

న్యూఢిల్లీ: ఈ వారం స్టాక్ మార్కెట్ డైరెక్షన్‌‌ను మాక్రో ఎకనామిక్ డేటా, గ్లోబల్ ట్రెండ్స్, విదేశీ ఇన్వెస్టర్ల ట్రేడింగ్ ప్రభావితం చేయనున్నాయని ఎనలిస్టులు  తెలిపారు. బండ్ల సేల్స్ డేటాను కూడా ట్రేడర్లు జాగ్రత్తగా గమనిస్తారని అన్నారు. 2025లో కొన్ని ట్రేడింగ్ సెషన్లే మిగిలి ఉన్నాయి. మార్కెట్ ఎక్కువగా  రేంజ్‌‌బౌండ్‌‌లో ఉంటుందని,  కొంత పాజిటివ్ ట్రెండ్ కనిపించొచ్చని  ఎనలిస్టులు అంచనా వేశారు. 

డిసెంబర్ ఎఫ్ అండ్ ఓ ఎక్స్‌‌పైరీ కారణంగా వోలాటిలిటీ పెరిగే అవకాశం ఉందన్నారు. దేశీయంగా నవంబర్ ఐఐపీ, హెచ్‌‌ఎస్‌‌బీసీ మాన్యుఫాక్చరింగ్ పీఎంఐ (జనవరి 2) డేటా, గ్లోబల్‌‌గా యూఎస్ ఫెడ్ మినిట్స్ (డిసెంబర్ 31),  ఫెడరల్ రిజర్వ్ బ్యాలెన్స్ షీట్ అప్‌‌డేట్స్ వంటివి విడుదల కానున్నాయి. గత వారం సెన్సెక్స్ 112 పాయింట్లు, నిఫ్టీ 75 పాయింట్లు లాభపడ్డాయి. 

2025లో రూ.1.6 లక్షల కోట్లు వెనక్కి

2025లో ఫారిన్ పోర్టుఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌‌పీఐలు) భారత  స్టాక్ మార్కెట్‌‌ నుంచి రికార్డు స్థాయిలో నికరంగా రూ.1.6 లక్షల కోట్లు ఉపసంహరించుకున్నారు. రూపాయి విలువ తగ్గడం,  అమెరికా టారిఫ్ భయాలు, అధిక వాల్యుయేషన్స్‌‌, బాండ్ యీల్డ్స్ పెరుగుదల, గ్లోబల్ అనిశ్చితులు ఇందుకు కారణమని ఎనలిస్టులు తెలిపారు.